వడోదరాలో మోడీ ఎన్నికల వ్యయం రూ. 50 లక్షలు
వడోదరా: గుజరాత్లోని వడోదరా స్థానం నుంచి కూడా లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి సుమారు రూ. 50 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు తేల్చారు. వడోదరాలో మోడీ మొత్తం ఎన్నికల వ్యయం రూ. 50,03,598గా లెక్కగట్టారు. ఇందుకు సంబంధించిన లెక్కలను మోడీ ప్రచార వ్యయం ఇన్చార్జి, వడోదరా మేయర్ భరత్ షా శుక్రవారం స్థానిక ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమర్పించారు.
దీని ప్రకారం మోడీ ఏప్రిల్ 9న నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా నిర్వహించిన సభతోపాటు మే 16న విజయోత్సవ సభ (వడోదరాలో 5.70 లక్షల ఓట్ల మెజారిటీతో మోడీ గెలిచారు) నిర్వహణకు రూ. 25.80 లక్షలు ఖర్చు అయింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పెద్ద రాష్ట్రాల్లో రూ. 40 లక్షల నుంచి రూ. 70 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో రూ. 22 లక్షల నుంచి రూ. 54 లక్షలకు పెంచడం తెలిసిందే.