ఇదేనా ప్రజాస్వామ్యం
- దేవరపల్లి ఘటనపై ఎస్పీ, డీపీవోకు వైఎస్సార్ సీపీ నేతలఫిర్యాదు
- స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని వినతి
సాక్షి, ఏలూరు : దేవరపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, వైఎస్సార్ సీపీ నేత తలారి వెంకట్రావు జిల్లా ఎస్పీ ఎస్.హరికృష్ణ, డీపీవో పి.నాగరాజువర్మకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని పేర్కొన్నారు.
దేవరపల్లిలో శుక్రవారం ఎంపీపీ ఎన్నికను టీడీపీ నేతలు అడ్డుకుని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నేతలపై దాడులకు పాల్పడటంపై ఆ పార్టీ నేతలు ఎస్పీని, డీపీవోను శుక్రవారం రాత్రి కలిశారు. ఘటనకు సంబంధిం చిన వివరాలను కలెక్టర్ సిద్ధార్థజైన్ దృష్టికి తీసుకువెళ్లారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, శనివారం జరిగే రీ పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
రిటర్నింగ్ అధికారి రామారావు టీడీపీకి కొమ్ముకాస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఇదేవిధమైన దౌర్జన్యాలను కొనసాగిస్తే సహించేది లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేంతోనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. జిల్లాలో ఒక్క ఎంపీపీ పదవి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కన్వికూడదన్న దురుద్దేశంతో టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. పచ్చని పశ్చిమలో కొట్లాటల సంస్కృతిని తీసుకురావడం దారుణమన్నారు.