కోతల.. కూతల ప్రభుత్వం
అలంపూర్: టీఆర్ఎస్ కోతల.. కూతల ప్రభుత్వమని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వానికి రైతు ఘోషపట్టడం లేదన్నారు. అప్పులబాధతో ఇప్పటివరకు 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు. శుక్రవారం ఆయన దక్షిణకాశీ అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. రేషన్‌కార్డులు, వృద్ధాప్య, వితంతువుల, వికలాంగుల పింఛన్లలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు.
ఒక జిల్లాను సింగపూర్, మరో జిల్లాను మలేషియాలా, ఇంకొక జిల్లాను న్యూయార్క్‌లా మారుస్తానని మాటలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. అసలు ప్రభుత్వానికి దశదిశా ఉందా..? అని ప్రశ్నించారు. రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని, ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షలు కేటాయిస్తామని చెప్పారని, వీటికి బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడున్నాయని అన్నారు.
దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పట్ల ఒక్క మంత్రి కూడా స్పందించడం లేదన్నారు. కేసీఆర్‌కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని.. సభా మర్యాదలను పాటించడం లేదని ఆరోపించారు.
ఉద్యమపార్టీగా చెప్పుకుని టీఆర్ఎస్లోకి వలసను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్న వారిలో 30శాతం ఉద్యమకారులు ఉంటే 70 శాతం వలసవాదులే ఉన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు స్ఫూర్తిదాయమని, అలాంటి వారినే కేసీఆర్ విస్మరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, అసలు సిద్ధాంతమే లేదన్నారు. ఆయన వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ నాయకులు ఉన్నారు.
జోగుళాంబ మాతనే రాష్ట్రాన్ని కాపాడాలి
తెలంగాణ రాష్ట్రాన్ని జోగుళాంబ మాతనే కాపాడాలని ప్రార్థించినట్లు మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహా అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతుందన్నారు.దక్షిణకాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఆయన శుక్రవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ చైర్పర్సన్ లక్ష్మి అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు జరిపించారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట మాజీ మంత్రులు ప్రసాద్, చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పీసీసీ నేతలు అద్దంకి ప్రభాకర్, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.