కమలేశ్ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలి
- గ్రామీణ తపాలా ఉద్యోగుల డిమాండ్
- హెడ్ పోస్టాఫీసు వద్ద ధర్నా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కమలేశ్ చంద్ర కమిటీ రిపోర్టును వెంటనే అమలు చేయాలని గ్రామీణ తపాలా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ (ఏఐజీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. డివిజన్ కార్యదర్శి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ దేశంలో 2.70 లక్షల మంది జీడీఎస్ ఉద్యోగులు తక్కువ జీతాలతో పనిచేస్తున్నారన్నారు. వీరి బాగోగుల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలేశ్ చంద్ర కమిటీ నివేదిక సమర్పించి నాలుగు నెలలైందన్నారు. ఈ నివేదికను వెంటనే ఆమోదించి ఇంప్లిమెంట్ చేయాలని కోరారు. ఎన్‌ఎఫ్‌పీఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.ఎస్.వరప్రసాద్ మాట్లాడుతూ సానుకూలమైన సిఫార్సులను వెంటనే అమలు చేయకపోతే ఏప్రిల్ 6వ తేదీన దేశవ్యాప్తంగా జీడీఎస్‌లతో పార్లమెంటు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. పోస్టుమాస్టర్ ఎద్దుల డేవిడ్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. జీడీఎస్ ఉద్యోగుల డివిజన్ అధ్యక్షుడు ఎ.ఎల్.కాంతారెడ్డి, సహాయ కార్యదర్శి (ఆదోని శాఖ కార్యదర్శి) డి.మద్దిలేటి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జీడీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.