హార్స్‌లీహిల్స్‌లో తప్పిన ముప్పు
బి.కొత్తకోట : చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్ ఘాట్‌లో శనివారం ఓ పెను ప్రమాదం తప్పింది. రైలింగ్‌ను ఢీకొని బస్సు ఆగిపోవడంతో అందులోని 50మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు రొట్టెల పండుగ కోసం కదిరి పట్టణం నిజాంవలీ వీధి, అడపాలవీధికి చెందిన 50 మంది ఎస్ఎల్వీ టూర్ అండ్ ట్రావెల్స్ బస్సులో శనివారం బయలుదేరారు. ఆదివారం రాత్రి తిరుగుపయణమయ్యారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు బస్సు హార్స్‌లీహిల్స్‌కు చేరుకుంది. యాత్రికులు మధ్యాహ్నం కొండపైనే భోజనం వండుకుని తిన్నారు. 2 గంటలకు బస్సు కదిరి బయలుదేరింది. కొండపై నుంచి అత్యంత ప్రమాదకరమైన మలుపు దాటింది. కింద నుంచి మూడో మలుపు వద్ద మలుపు తిరుగుతూ ఘాట్ రోడ్డుపై ఇనుప రెయిలింగ్‌ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా బస్సులోని వారంతా హాహాకారాలు చేశారు. అయితే బస్సు రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రెండు అడుగులు ముందుకెళ్లినా హోర ప్రమాదం జరిగిపోయి ఉండేది. సాయంత్రం 5 గంటల వరకు బస్సు ఘాట్ రోడ్డుకు అడ్డంగానే నిలిచిపోయింది. దీంతో కొండపైకి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. డీజిల్, ఆయిల్ అయిపోవడమే ఇందుకు కారణమని బస్సు డ్రైవర్, రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌రెడ్డి చెప్పారు.ఆయిల్ అయిపోతే పవర్‌స్టీరింగ్ పనిచేయదన్నారు.