స్నాప్‌డీల్ లో రూ. 4,400 కోట్ల పెట్టుబడి !
కంపెనీతో చైనా ఆలీబాబా చర్చలు
న్యూఢిల్లీ: దేశీ ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్‌లో ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా 500-700 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,100-రూ. 4,400 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకోసం స్నాప్‌డీల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మార్కెట్ పరిశీలకుల అంచనా ప్రకారం స్నాప్‌డీల్ విలువ సుమారు 4-5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 25,000 కోట్లు-రూ. 31,000 కోట్లు) ఉంటుంది.
స్నాప్‌డీల్ ఇప్పటిదాకా 1 బిలియన్ డాలర్ల దాకా నిధులు సమీకరించింది. ఆలీబాబాలో కూడా ఇన్వెస్ట్ చేసిన జపాన్ టెలికం దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కూడా ఇటీవలే స్నాప్‌డీల్‌లో 627 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,762 కోట్లు) పెట్టుబడి పెట్టింది. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా వ్యక్తిగత హోదాలో ఇందులో ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు ఆలీబాబా గ్రూప్ గతేడాది అమెరికాలో పబ్లిక్ ఇష్యూ ద్వారా 25 బిలియన్ డాలర్లు సమీకరించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్లైన్, మొబైల్ కామర్స్ కంపెనీ అయిన ఆలీబాబా గ్రూప్ .. వెబ్సైట్లో 127 బిలియన్ డాలర్ల మేర ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయని అంచనా.