జనుము నుంచి ధనము!
మహిళా విజయం
నాగదేవి గోదావరి తీరాన పుట్టిన అచ్చమైన తెలుగింటి అమ్మాయి. పదవ తరగతితో చదువాపేసి తలవంచుకుని తాళి కట్టించుకున్న అమ్మాయి. అది ఒకప్పుడు... మరి ఇప్పుడు... పది మంది మహిళలకు ఉపాధినిస్తోన్న మహిళా పారిశ్రామికవేత్త! నేషనల్ జ్యూట్ బోర్డు ప్రోత్సాహంతో పొరుగు రాష్ట్రాల్లో మన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సృజనశీలి! వివరాలు ఆమె మాటల్లోనే...
మాది రాజమండ్రి. మా వారు (జీవీఎస్ఎస్ నారాయణ) ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తారు. పెళ్లయిన తర్వాత హైదరాబాద్‌లో కాపురం పెట్టాం. ఐదేళ్ల కిందట రెండు కుట్టు మెషీన్లతో మొదలైన నా జ్యూట్ బ్యాగ్ యూనిట్ ఇప్పుడు 18 మెషీన్లతో నడుస్తోంది. ఎనిమిది మంది నెల జీతానికి పనిచేస్తున్నారు. మరో ఐదారుగురు పీస్ లెక్కన పనిచేస్తున్నారు. ఇంకో ఇరవై మంది శిక్షణ కోసం వస్తున్నారు.
చిన్నప్పటి సరదాకి శిక్షణ తోడైంది...
చిన్నప్పుడు బుట్టలు అల్లేదాన్ని. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కుటుంబం, పిల్లలతో అలవాటు తప్పింది. ఒకసారి ‘నేషనల్ జ్యూట్ బోర్డు’ వాళ్లు మా ఇంటికి దగ్గరలో ఉన్న సాకేత్ హాలిడే హోమ్స్ దగ్గర ఉచిత శిక్షణ క్యాంపు పెట్టారు. ఓసారి చూసి వద్దామని వెళ్లిన దాన్ని కాస్తా 21 రోజుల శిక్షణలో చేరి జ్యూట్‌తో సంచులు, ఇతర వస్తువులను చేయడం నేర్చుకున్నాను. శిక్షణ తర్వాత, జ్యూట్ బోర్డు జిల్లాల్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు, ఆ తర్వాత ఎలీప్ నిర్వహించే శిక్షణ కార్యక్రమాలలోనూ టీచర్‌గా పనిచేశాను.
ఖాళీ సమయంలో మార్కెటింగ్...
శిక్షణ కార్యక్రమాలకు నాకు రోజుకు వెయ్యి రూపాయలిచ్చేవారు. క్లాసులు లేని సమయాల్లో మాకు దగ్గరలో ఉన్న ‘జ్యూటెక్స్ విలేజ్’లో తయారయ్యే వస్తువులను మార్కెట్ చేయడం మొదలుపెట్టాను. పెద్ద మొత్తంలో సరుకు తీసుకుని ఖైరతాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్, శిల్పారామంలలో స్టాల్ పెట్టేదాన్ని. అక్కడే కొత్త ఆర్డర్లు వచ్చేవి. వినియోగదారుల అవసరాన్ని బట్టి కొత్త డిజైన్లు రూపొందించి జ్యూటెక్స్ పరిశ్రమ నుంచి తయారు చేయించుకునేదాన్ని. ఇది గమనించిన జ్యూట్‌బోర్డు డెరైక్టరు నరసింహులుగారు ‘నువ్వే పరిశ్రమ స్థాపించవచ్చుకదా’ అన్నారు. అలా మొదలైందే ‘దేవి జ్యూట్ బ్యాగ్స్’!
యాభై వేలతో...
2009లో రెండు మెషీన్లతో ప్రారంభించాను. రెండు మెషీన్లకు పాతికవేలు, ముడి సరుకుకు పాతిక వేలయింది. నాతోపాటు మరొక అమ్మాయి పనిచేసేది. నాకప్పటికి జీతం ఇవ్వగలననే భరోసా కూడా లేదు. ఆమెకి పీస్లెక్కన డబ్బు ఇచ్చే ఏర్పాటు చేసుకున్నాను. ఇద్దరం కలిసి రోజుకు యాభై సంచులు కుట్టేవాళ్లం. ఇరవై రోజులు పని చేసుకుని ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లేదాన్ని. ప్రతినెలా ఏదో ఒక చోట జ్యూట్ బోర్డు వారి ప్రదర్శనలుండేవి. ప్రదర్శనలో ఉత్పత్తుల అమ్మకానికి వెళ్లిన వారికి జ్యూట్‌బోర్డు... టి.ఎ, డి.ఎ, ఉచితంగా స్టాల్‌తోపాటు బస కూడా ఇస్తుంది. అలా పుణే, నాగపూర్, గోవా, సూరత్‌లలో కూడా అమ్మాను. లక్ష సరుకును లక్షా యాభై వేలకు అమ్మవచ్చు.
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి
ఫొటో: వి.రవీందర్
ఏలూరు నుంచి జనుము...
పరిశ్రమ నిర్వహణకు ముడిసరుకు ఏలూరు జ్యూట్ మిల్ నుంచి తెచ్చుకుంటాను. మధ్యలో కొద్దిపాటి అవసరాలకు దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న జ్యూట్సెంటర్లో తీసుకుంటాను. బేగంబజార్‌లో చెక్క గుండీల వంటివి దొరుకుతాయి. ఈ పరిశ్రమకు మరో శాఖను మా సొంతూరు రాజమండ్రిలో స్థాపించాలని ఉంది.
- జి.నాగదేవి ఈసీఐఎల్, హైదరాబాద్ ఫోన్: 8886665898