పరువు దక్కేనా!
►నేడు చివరి టి20 మ్యాచ్
► తీవ్ర ఒత్తిడిలో భారత్
► ధోని కెప్టెన్సీకి పరీక్ష
► క్లీన్‌స్వీప్‌పై దక్షిణాఫ్రికా గురి
సొంతగడ్డపై మొనగాళ్ల ముద్రతో బరిలోకి దిగిన భారత బృందం ఇప్పటికే ప్రత్యర్థి ముందు తలవంచింది. పొట్టి ఫార్మాట్లో అపరిమిత అనుభవం ఉన్నా భారత్‌లో తొలిసారి జరిగిన పూర్తి స్థాయి టి20 సిరీస్‌లో అది అక్కరకు రాకపోవడంతో పరాజయం దక్కింది. ఇక మిగిలింది కాస్త పరువు నిలబెట్టుకోవడమే. తుది జట్టులో మార్పులు చేస్తారా, మూడో స్పిన్నర్‌ను మారుస్తారా... ఏం చేసినా ఒక విజయమైతే కావాలి. ఆటగాళ్లతో పాటు కెప్టెన్ కూడా తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్న స్థితిలో మన జట్టు ఈ పోరులో సఫారీల జోరును ఆపాలంటే రెట్టింపు శ్రమించాల్సి ఉంది.
కోల్‌కతా: కెప్టెన్‌గా భారత్‌కు అత్యుత్తమ విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోని ఈ ఏడాదిలో రెండోసారి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే అనూహ్యంగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమి అనంతరం ఇప్పుడు స్వదేశంలో టి20 సిరీస్ పోయింది. కనీసం టి20 ప్రపంచకప్ వరకు కొనసాగాలని పట్టుదలగా ఉన్న ధోని ఆట, నాయకత్వంపై ఇప్పుడు ప్రతీ మ్యాచ్ తర్వాత ‘పోస్ట్‌మార్టం’ జరిగే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలంటే గెలుపు తప్పనిసరి. మరోవైపు సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో నేడు (గురువారం) ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో చివరిదైన మూడో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
అమిత్ మిశ్రాకు చోటు?: తొలి మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యం, రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తడబాటు... మరి మూడో మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన ఓపెనర్ ధావన్ చెలరేగాల్సి ఉంది. రైనా మెరుపులు కూడా ఇంకా కనిపించలేదు. రోహిత్, కోహ్లిలు చెలరేగితే భారీ స్కోరుకు ఆశలుంటాయి. అన్నింటికి మించి కెప్టెన్ ధోని బ్యాటింగ్ చాలా మెరుగవ్వాల్సి ఉంది. ఒకప్పుడు ఇన్నింగ్స్ చివర్లో ధనాధన్ షాట్లతో రెచ్చిపోయే ధోనిలో ఇప్పుడు ఆ దూకుడు కనిపించడం లేదు. పరిస్థితి ఎలా ఉన్నా తన తరహాలో షాట్లు ఆడటమే సరైందని, అతి జాగ్రత్తకు పోనని ఇప్పటికే ప్రకటించిన ధోని ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటితే జట్టుకు ఉపయోగం. రెండు డకౌట్లు తన ఖాతాలో వేసుకున్న అంబటి రాయుడు స్థానంలో అజింక్య రహానేకు అవకాశం దక్కవచ్చు. పేస్ బౌలింగ్‌లో జట్టుకు పెద్దగా ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవు. స్పిన్‌లో అశ్విన్ ఒక్కడే చెలరేగుతున్నాడు. లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈసారి ఆడే అవకాశం కనిపిస్తోంది. పెద్దగా ఆకట్టుకోని అక్షర్ పటేల్ స్థానంలో లేదా హర్భజన్‌ను తప్పించి మిశ్రాను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
మార్పులకు అవకాశం...: మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో తమ జట్టులోని మరి కొందరు కొత్త కుర్రాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఇక్కడే టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో లెగ్‌స్పిన్నర్ ఎడీ లీకి అవకాశం దక్కవచ్చు. సుదీర్ఘ పర్యటన ముందుండటంతో ఆమ్లాకు విశ్రాంతినిచ్చి ఓపెనర్ క్వింటన్ డి కాక్‌ను కూడా ఆడించే అవకాశం ఉంది. ప్రధాన ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటం కూడా దక్షిణాఫ్రికా జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. డివిలియర్స్, డు ప్లెసిస్, డుమిని, డేవిడ్ మిల్లర్లతో జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది.
సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్ గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటాడు. అతని బ్యాటింగ్ కూడా జట్టుకు అదనపు బలం. ఇక పేసర్లు అబాట్, రబడ చక్కగా రాణించారు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రాణించిన డి లాంజ్‌కు మరో మ్యాచ్ అవకాశం ఇవ్వాలనుకుంటే రబడ స్థానంలో చోటు దక్కుతుంది. అనుభవం లేకపోయినా టి20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లతో ఇక్కడికి వచ్చి ఫలితం సాధించి సఫారీలు మరో విజయమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అంబటి రాయుడు/అజింక్య రహానే, హర్భజన్ సింగ్, అశ్విన్, భువనేశ్వర్, మోహిత్ శర్మ, అక్షర్/మిశ్రా.
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), డివిలియర్స్, డి కాక్, డుమిని, ఫర్హాన్ బెహర్దీన్, డేవిడ్ మిల్లర్, ఆల్బీ మోర్కెల్, మోరిస్, అబాట్, రబడ/లాంజ్, తాహిర్/ఎడీ లీ.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూల పిచ్ అని క్యురేటర్ ప్రకటించారు. అయితే ఈడెన్‌లో ఎప్పటిలాగే స్పిన్నర్లు కూడా ప్రభావం చూపవచ్చు. 31 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
మ్యాచ్ రాత్రి గం. 7.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1, డీడీలో ప్రత్యక్ష ప్రసారం
ఇక్కడి మైదానంలో బౌండరీ చిన్నది కాబట్టి రెండు పరుగులు రావడం కష్టం. సింగిల్పైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ క్రమంలో రనౌట్‌కు అవకాశం ఎక్కువ. గత మ్యాచ్‌లలాగే మా ఫీల్డింగ్‌తో బ్యాట్స్‌మెన్‌పై మరింత ఒత్తిడి పెంచుతాం. సిరీస్‌కు మేం బాగా సన్నద్ధమయ్యాం. గెలవడం సంతోషాన్నిచ్చింది. స్కోరును 3-0 చేయాలని పట్టుదలగా ఉన్నాం. ఐపీఎల్ మా అందరికీ ఎంతో మేలు చేసింది. ఆ అనుభవం ఇక్కడ పనికొస్తోంది.’
-మిల్లర్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్
ఈడెన్‌తో నా అనుబంధం ప్రత్యేకం. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడే ఆఖరి టెస్టు ఆడి రిటైర్ అవ్వాలనేది నా కోరిక. దాల్మియా లేకపోవడమే ఈ మ్యాచ్‌లో లోటు. సిరీస్ ఓడినా ఈ మ్యాచ్ మేం గెలవగల సత్తా జట్టుకు ఉంది. ఈ ఫలితం తర్వాత పర్యటన దిశ మారిపోవచ్చు కూడా. మంచి ఆరంభం లభిస్తే చాలు. ఈ ఫార్మాట్లో మనోళ్లు అత్యుత్తమ ఆటగాళ్లని చెప్పగలను. వచ్చే టి20 ప్రపంచకప్‌లో స్పిన్నర్లదే కీలక పాత్ర అవుతుంది. తుది జట్టులో ఎవరున్నా విజయం కోసం వంద శాతం శ్రమించడమే అందరికీ తెలుసు.’
-హర్భజన్ సింగ్, భారత బౌలర్