కాష్మోరా దర్శకుడితో విజయ్‌సేతుపతి
విజయ్‌సేతుపతి హీరోగా చిత్రం అంటే నిర్మాతలు చీకూచింతా లేకుండా నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. కారణం వారి గల్లాపెట్టెలు నింపే కథానాయకుడిగా విజయ్‌సేతుపతి ఎదగడమే. ఈయన నటించిన ఆరు చిత్రాలు ఈ ఏడాది తెరపైకి వచ్చాయి. అన్నీ సక్సెస్ బాటలోనే పయనించాయి. ప్రస్తుతం విజయ్‌సేతుపతి చేతిలో మరో ఐదు చిత్రాలు ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. కాష్మోరా చిత్ర దర్శకుడు గోకుల్‌తో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
దీనికి సీక్వెల్ ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గోకుల్ విజయ్‌సేతుపతి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి గోకుల్ తెలుపుతూ విజయ్‌సేతుపతితో తాను చేసే చిత్రం ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా చిత్రానికి సీక్వెల్ కాదని స్పష్టం చేశారు. ఇది తాజా కథ అనీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. త్వరలో సెట్ పైకి వెళ్లే ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందనీ తెలిపారు. తాను ఆరేళ్లలో మూడు చిత్రాలకే దర్శకత్వం వహించాననీ, అందులో కాష్మోరా చిత్రం నిర్మాణం చాలా ఆలస్యమైందన్నారు. అయినా ఆ చిత్రం తనకు లైఫ్‌టైమ్ అనుభవం అని పేర్కొన్నారు. ఇకపై చిత్రాల విషయంలో వేగం పెంచనున్నట్లు చెప్పారు.