వారిలో దేశభక్తి రగిలించడమే ధ్యేయం
► ‘సాక్షి’తో డీఏవీపీ అదనపు డైరెక్టర్ జనరల్ వేణుధర్ రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: ‘సుదీర్ఘంగా సాగిన స్వాతంత్య్రోద్యమం గురించి నేటి తరాలకు పెద్దగా అవగాహన లేదు. ఒకవేళ తెలిసినా... మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలా కొందరి పోరాట యోధుల పేర్లే స్మరిస్తుంటాం. వీరితో పాటు వేల సంఖ్యలో స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. అందరి ధన, మాన, ప్రాణ త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నాం. ఈ ఘట్టంలో అనేక ఉద్యమాలు, ప్రతిఘటనలు, పాదయాత్రలు, జాతిని ఏకం చేసే సమావేశాలు, ప్రసంగాలు, వీర మరణాలు.. ఇలా ఎన్నో రూపాలు ఆవిష్కృతమయ్యాయి.
ఈ పరిణామ సంఘటనలను నేటి తరానికి సజీవంగా అందించి వారిలో జాతీయోద్యమ స్ఫూర్తిని, దేశభక్తిని రగిలించాలన్నదే మా ఉద్దేశం. స్వేచ్ఛా ఫలాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. జాతి నిర్మాణానికి పునరంకితమయ్యే దిశగా యువతరానికి ప్రేరణ కలిగించడమే అంతిమ లక్ష్యం’ అని అడ్వరై్టజింగ్, విజువల్ పబ్లిసిటీ డైరెక్టరేట్ (డీఏవీపీ) అదనపు డైరెక్టర్ జనరల్ ఎన్.వేణుధర్ రెడ్డి పేర్కొన్నారు. డీఏవీపీ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ‘70 ఏళ్ల స్వాతంత్య్రం– త్యాగాలను స్మరిద్దాం’ పేరిట ఈ నెల 19న ఫొటో ప్రదర్శన ప్రారంభించారు. పబ్లికేషన్ విభాగం ఆధ్వర్యంలో అపూర్వ పుస్తకాలు ప్రదర్శిస్తున్నారు. ఈనెల 23 వరకు కొనసాగే ఎగ్జిబిషన్ ప్రాధాన్యం, విశేషాలపై వేణుధర్ రెడ్డితో ‘సాక్షి’ ముచ్చటించింది.
పుస్తకాలూ అపూర్వమైనవే...
స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన మహోన్నతుల విజయగాథలు, జీవిత చరిత్రలు, ప్రసంగాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పబ్లికేషన్స్ డివిజన్ బిజినెస్ మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. వీటిని డిస్కౌంట్ ధరలకు సందర్శకులకు విక్రయిస్తున్నామని చెప్పారు. అంతేగాక అరుదైన చిత్రాలతో కూడిన పుస్తకాలు కూడా విక్రయానికి ఉంచామన్నారు. మొత్తం 132 టైటిళ్ల పుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.