నల్లడబ్బు, విదేశీ సొమ్ము వేరు: పొంగులేటి
విదేశాల్లో డిపాజిట్ చేసిన డబ్బుకు, నల్లధనానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలని ఖమ్మం వైఎస్ఆర్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్లధనం వ్యవహారంపై లోక్సభలో రెండోరోజు జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం, వివిధ దేశాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
1998-2008 సంవత్సరాల మధ్య గల పదేళ్ల కాలంలో దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల ధనం ఇతర దేశాలకు వెళ్లిపోయిందని అన్నారు. పన్నుల వ్యవస్థ సరళంగా ఉన్న సైప్రస్, స్విట్జర్లండ్ దేశాలకు ఈ ధనం వెళ్లందని ఆయన చెప్పారు. మనం మన విధానాలను సరళీకరించుకుంటే.. ఆ ధనం ఇక్కడ ఉండేలా చూసుకోవచ్చని, అది మన దేశ సమగ్రాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.