Kolkata Doctor Incident: సహచరులే కీచకులా?
కోల్‌కతా: ఆర్జీ కార్ ఆసుపత్రిలో యువ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులను ప్రశ్నించారు. తమ కుమార్తెపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో అదే ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు జూనియర్ వైద్యులు, ఇతర సీనియర్ వైద్యుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నామంటూ తల్లిదండ్రులు చెప్పినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో బాధితురాలితోపాటు కలిసి పనిచేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు తెలిపినట్లు స్పష్టంచేశారు. 30 మందిని పిలిపించి, విచారించాలని నిర్ణయించామని అధికారులు వివరించారు. ఆసుపత్రి వైద్యులను, పోలీసు అధికారులను ప్రశ్నించబోతున్నామని చెప్పారు. బాధితురాలు హత్యకు గురైన రోజు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి సమన్లు జారీ చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా, ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన గదిలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఏర్పాటైన విచారణ కమిటీ ఆరోపించింది. హత్య సంగతి బయటపడగానే ఆ గదిని పరిరక్షించాల్సి ఉండగా, కొందరు లోపలికి వెళ్లి శుభ్రం చేశారని పేర్కొంది. కోల్‌కతాలోని డాక్టర్ హత్యాకాండను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు శుక్రవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. విధ్వంసం కేసులో 25 మంది అరెస్టు ఆర్జీ కార్ హాస్పిటల్లో విధ్వంసం కేసులో ఇప్పటిదాకా 25 మందిని అరెస్టు చేసినట్లు కోల్‌కతా పోలీసులు చెప్పారు. వారిని కోర్టుకు తరలించామని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం వారిని ఈ నెల 22 దాకా పోలీసు కస్టడీకి అప్పగించిందని వెల్లడించారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ ట్రైనీ డాక్టర్ హత్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పశి్చమబెంగాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై బైఠాయించారు. బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. కోల్‌కతాలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. నిరసన కార్యక్రమాల్లో సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యూనిస్టు) సైతం పాల్గొంది. విధ్వంసం వెనుక సీపీఎం, బీజేపీ : మమతజూనియర్ డాక్టర్‌ను హత్య చేసిన రాక్షసులకు ఉరిశిక్ష విధించాలని పశి్చమ బెంగాల్ సీఎం మమత డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని సీబీఐని కోరారు. ఆస్పత్రి∙విధ్వంసం వెనుక ప్రతిపక్ష సీపీఎం, బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. సాక్ష్యాధారాలను మాయం చేయడానికే ఈ విధ్వంసం జరిగిందని అన్నారు. జూనియర్ డాక్టర్ హత్యపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. సీపీఎం, బీజేపీ మధ్య బంధం త్వరలో బయటపడుతుందని చెప్పారు. నేడు నాన్–ఎమర్జెన్సీ వైద్య సేవల నిలిపివేతయువ డాక్టర్ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 24 గంటలపాటు నాన్–ఎమర్జెన్సీ వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల దాకా ఆసుపత్రుల్లో ఈ సేవలను అందించబోమని వెల్లడించింది.