మంగళంపల్లికి తెలుగు కమ్యూనిటీ ఘననివాళి
గాన గంధర్వుడు, కర్నాటక సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్ డాక్టర్. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతిపై డల్లాస్ తెలుగు కమ్యూనిటీ ఘన నివాళి అర్పించింది. టెక్నాస్‌లోని ఇర్వింగ్‌లో అమరావతి ఇండియన్ రెస్టారెంట్లో నవంబర్ 22న భేటీ అయిన తెలుగు కమ్యూనిటీ ఆయనతో ఉన్న గత స్మృతులను గుర్తుచేసుకుంది. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ముఖ్యంగా డల్లాస్‌లోని తెలుగు కమ్యూనిటీ ఆయనను మరచిపోలేదని టాంటెక్స్(ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం) అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ చెప్పారు. లోకల్ కమ్యూనిటీకి మురళీకృష్ణ చాలా దగ్గర వ్యక్తన్ని పేర్కొన్నారు. తన అధ్యక్ష ఎన్నికల సమయంలో టాంటెక్స్తో కలిసి తానా 2011 అక్టోబర్‌లో నిర్వహించిన సంగీత సదస్సులో బాలమురళికృష్ణ చేసిన సంగీత కచేరీ మంత్రముగ్థుల్ని చేసిందంటూ ఆయన సన్నిహిత వ్యక్తి డాక్టర్. ప్రసాద్ తోటకూర చెప్పారు.
1990లో న్యూజెర్సీ కచేరి నుంచి మురళీకృష్ణ తనకు తెలుసని, కర్నాటక మ్యూజిక్‌లో బాలమురళీకృష్ణ ఎంతో ఖ్యాతి గడించినప్పటికీ, ఆయన చాలా సాధారణ వినయపూర్వక వ్యక్తిలాగా మెలిగేవారని రావ్ కల్వాలా కొనియాడారు. ఎలాంటి సాధారణ విద్య లేనప్పటికీ, సంగీత ప్రపంచాన్ని చిరస్థాయికి తీసుకెళ్లారని, అలాంటి వ్యక్తిని మనం ఎక్కడా చూడలేమని చంద్రహాస్ మధుకురి చెప్పారు. ఆయన పేరుని, ఆయన అందించిన సంగీతాన్ని ఎప్పటికీ మరచిపోమని పేర్కొన్నారు. విజయవాడలో తన చిన్నతనం నుంచే బాలమురళీకృష్ణ తెలుసని, కర్నాటక గాయనిగా పలు సార్లు ఆయనను కలిసి, ఆశీర్వచనాలు తీసుకున్నట్టు మీనాక్షి అనిపింది గుర్తుచేసుకున్నారు. మంగళంపల్లితో ఆమెకున్న గత స్మృతులను ఈ సందర్భంగా ఆమె షేర్ చేసుకున్నారు. మంగళంపల్లి మృతికి కొద్దిసేపు మౌనం పాటించిన తెలుగు కమ్యూనిటీ, తన కుటుంబానికి సంతాపం తెలిపింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులర్పించింది.