నాటకీయ పరిణామాల మధ్య వీహెచ్ అరెస్టు
రాజమహేంద్రవరం క్రైం : రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావును, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్టు చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయనను రాజమహేంద్రవరంలోని ఓ ప్రముఖ హోటల్లోనుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ముద్రగడను కలిసి తీరుతానని భీష్మించిన వీహెచ్‌ను, హర్షకుమార్‌ను, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు కొత్త సీతారాములును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు. వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. ముందుగా వీహెచ్ హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో కొవ్వూరు చేరుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ ఆయనను కారులో తీసుకువచ్చారు.
ఉదయం టిఫిన్ చేసేందుకు కిందకు దిగిన సమయంలో ఆయన పోలీసుల కంటపడడంతో పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేసి హనుమంత రావును ముద్రగడ పద్మనాభాన్ని కలవకుండా అడ్డుకున్నారు. అనంతరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో హర్షకుమార్ తనయుడు జి.వి శ్రీరాజ్, రాజమహేంద్రవరం సిటీ కాపు యువత నాయకులు అడపా రాజు, రాజమహేంద్రవరం రూరల్ కాపు యువత నాయకులు పసుపులేటి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.