ఐదు ఐదులు!
నడుం పూర్తిగా వంగిపోయిన ఒక ముసలివాడు ఏదో వెదుకుతున్నాడు. ‘‘తాతా! యేం వెదుకుతున్నావు?’’ అని అడిగింది ఒక చిన్నది. ‘‘పోయిన యవ్వనాన్ని వెదుకుతున్నాను’’ అన్నాడు వృద్ధుడు. ప్రశ్నోత్తర రూపంలో ఉన్న ఈ పార్సీ కవిత- రాజు జహంగీరూ, రాణి నూర్జహానుల మధ్య జరిగిన సంభాషణ.
మా మదర్సా(బడి)లో మౌల్వీ (పంతులు) ఈ కవిత చదివి అర్థం చెబుతుంటే నేను నా ధోరణిలో అనువదించుకున్నాను. ఇది ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే నాతో చదువుకున్న ఒక మిత్రుడు ఈమధ్య కలిసి ‘‘నీ ముఖంలో అప్పుడే వృద్ధాప్యపు ఛాయలు కనబడుతున్నాయేమోయ్?’’ అని నన్ను అడిగాడు. అతను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఇప్పుడు పని చేస్తున్నాడు, దృఢకాయుడు. కానైతే నా వయస్సే యాభై ఐదు.
యాభై ఐదులో రెండు అయిదులున్నాయి కదా! ఐదుతో ఐదు ప్లస్ చేస్తే బాల్యం(పదేండ్లు). ఐదుతో ఐదు ఇంటూ చేస్తే యౌవనం (పాతిక) ఐదు పక్కన ఐదు వ్రాస్తే యాభై ఐదు. వార్ధక్య ద్వారం! అయిదులో మరో చమత్కారం ఉంది. మన్ను, మిన్ను, నీరు, గాలి, వెలుతురు కలిసి పంచభూతాలు!
- డా. దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ నుంచి