ఉప్పల్ టెస్ట్: ఒక్క బంతికి అంత హైడ్రామానా?
హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అయితే భారత్ విజయానికి అవసరమైన చివరి వికెట్ విషయంలో అంపైర్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ఉప్పల్ టెస్టులో బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్‌లో 101వ ఓవర్ ను అశ్విన్ బౌలింగ్ చేశాడు. ఓ ఓవర్లో మూడో బంతిని తస్కీన్ అహ్మద్ ఆడగా బంతి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. టీమిండియా అప్పీల్ చేయడంతో అంపైర్ ఎరాస్మాస్, లెగ్ అంపైర్ తో చర్చించి క్యాచ్ ఔట్ అడిగి ఉంటారనుకుని థర్డ్ అంపైర్ కు నివేదించారు.
రీప్లేలో బంతి బ్యాట్ కు తగలలేదని తేలడంతో నాటౌట్ గా థర్డ్ అంపైర్ నిర్ణయం వెల్లడైంది. అయితే విరాట్ కోహ్లీ దీనిపై ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూకు వెళ్లాడు. మరోసారి రీప్లేలు చూసిన తర్వాత బంతి స్టంప్స్ కు తగిలే ఛాన్స్ ఉందని తేలడంతో తస్కీన్ ను ఔట్ అని థర్డ్ అంపైర్ నిర్ణయం రాగానే భారత ఆటగాళ్ల సంబరాలు మొదలయ్యాయి. ఇంతవరకూ ఒకే.. అయితే భారత్ ఔట్ అని అడిగిన తర్వాత తొలిసారి రీప్లేలో నాటౌట్ అని తేలింది. బంతి నేరుగా ఫీల్డర్ల చేతుల్లో పడలేదని అంపైర్ గ్రహించలేక పోయారా.. లేక ఇద్దరు అంపైర్లు కేవలం క్యాచ్ ఔట్ మీద దృష్టిపెట్టి.. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారా అనేది అలోచించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్ కు రివ్యూ అవకాశం లేకపోతే, ఆ సమయంలో ఆ వికెట్ భారత్ కు కీలకమైతే.. లేదా అంపైర్ల తొలి రివ్యూ నిర్ణయంతో ఫీల్డింగ్ టీమ్ ఓడిపోతే నైతిక బాధ్యత ఎవరిది అన్న దానిపై స్పష్టత లేదు. ఒక్క బంతికి రెండు రివ్యూలు అవసరమా.. ఇంత నిర్లక్ష్యంగా అంపైర్లు నిర్ణయాలు ఇస్తున్నారు అని క్రీడా విశ్లేషకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.