dual role
-
ఆ లుక్ కోసం ఆహారం మానేసిన కమల్! కేవల పండ్ల రసాలతోనే..
‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ తాజాగా ‘ఇండియన్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ‘ఇండియన్’ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘ఇండియన్’లో సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో నటించారు కమల్‌హాసన్. అయితే ‘ఇండియన్ 2’ కథను మాత్రం సేనాపతి, అతని తండ్రి పాత్రల నేపథ్యంలో (1920 సమయంలో...) సాగుతూనే, మరోవైపు ఇప్పటి కాలం కూడా టచ్ అయ్యేలా స్క్రీన్‌ప్లే రెడీ చేశారట శంకర్. అలాగే ఈ చిత్రంలో కమల్‌హాసన్ ఓ పాత్రలో తొంభైసంవత్సరాల వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ లుక్‌కి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు కమల్ ఆహారం తీసుకోవడంలేదట. ప్రొస్థటిక్ మేకప్ వాడడంతో నోరు పూర్తిగా తెరవలేని పరిస్థితుల్లో షూటింగ్ అప్పుడు కేవలం పండ్ల రసాలతో సరిపెట్టుకుంటున్నారట. -
ఆ సినిమాలో అనసూయ డ్యుయెల్ రోల్ !.. ఒకటి రెబల్‌గా మరొకటి
Anchor Anasuya Dual Role In Ravi Teja Khiladi Movie: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేకపాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది. రంగస్థలలంలో రంగమ్మత్తగా ఎంత పాపులర్ అయిందో కూడా తెలిసిందే. అలాగే పుష్ప సెకండ్ పార్ట్ 'ది రూల్'లో కూడా అనసూయ పాత్ర ఆసక్తిగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అనసూయ మరో విభిన్న పాత్రలో తన సత్తా చాటనుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'ఖిలాడి' సినిమాలో అనసూయ ద్విపాత్రిభినయం చేస్తోందని సమాచారం. ఒక పాత్రలో రెబల్‌గా, రెండో పాత్రలో ఒక బ్రహ్మణ యువతిగా సందడి చేయనుందని సమాచారం. అయితే ఇందులో ఒక పాత్ర చనిపోతే మరొ రోల్ సినిమా చివరి వరకూ ఉండి ఆసక్తికరంగా ఉంటుందని టాక్. ఒకరకంగా అనసూయకు ఇది ఎక్కువ నిడివి ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ఇంకా ఇవే కాకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో కూడా అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్ర చేస్తుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో, మలయాళంలో మమ్ముట్టి నటిస్తున్న భీష్మ పర్వం మూవీలోనూ విభిన్న పాత్రలు చేస్తోందట అనసూయ. -
మరోసారి ఆ స్టార్ హీరో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడా?
నటుడు సూర్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తారా అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల విడుదలైన జై భీమ్ ప్రశంసలను అందుకుంటోంది. అలాగే పాండిరాజ్ దర్శకత్వంలో ఎదుర్కుమ్ తుణిందవన్ చిత్రం జనవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో వాడి వాసల్ చిత్రంలోనూ సూర్య నటిస్తున్నారు. కాగా అన్నాత్త ఫేమ్ శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇందులో∙ద్విపాత్రాభినయం చేయనున్నట్లు, జ్ఞానవేల్ రాజా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా సూర్య ఇంతకు ముందు పేరళగన్, వారణం ఆయిరం, వేల్, మాట్రాన్ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. చదవండి: Suriya Jai Bhim: పార్వతి అమ్మాళ్కు సూర్య రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ -
డబుల్ యాక్షన్
‘జీన్స్’ సినిమాలో ఐశ్వర్యా రాయ్ ద్విపాత్రాభినయం చేశారు. అయితే నటించింది ఒక్క పాత్రలోనే. రెండు పాత్రలూ చేసినట్టు కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేశారు. కానీ ఈసారి నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వమ్’. తమిళ ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వమ్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తారని తెలిసిందే. తాజాగా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. చోళుల నాశనాన్ని కోరుకునే రాణి నందినిగా ఐష్ నటిస్తారు. అలానే నందిని తల్లి మందాకిని అనే మూగ పాత్రలోనూ కనిపిస్తారట. ‘నా కెరీర్లోనే చాలెంజింగ్ సినిమా ఇది’ అంటూ ఐష్ ఈ సినిమా గురించి ఆల్రెడీ పేర్కొన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, నయనతార, కీర్తీ సురేశ్, అనుష్క, అమలా పాల్, పార్తిబన్ ముఖ్య పాత్రల్లో నటిస్తారని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. -
సాహో : ప్రభాస్ సింగిలా.. డబులా?
సాహో రిలీజ్‌కు ఇంకా పది రోజులు మాత్రమే సమయముంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో ఈ సినిమా మీద రకరకాల వార్తలు మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. సాహోలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే పోస్టర్లు, టీజర్, ట్రైలర్ల రిలీజ్ తరువాత ఆ టాక్ మరింత బలపడింది. ప్రభాస్ రెండు రకాల హెయిర్ స్టైయిల్స్‌తో కనిపిస్తుండటంతో సినిమాలో ప్రభాస్ అండర్‌కవర్ పోలీస్‌గా, దొంగగా రెండు పాత్రల్లో కనిపిస్తాడని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిసన్న ఈ సినిమాను సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. -
నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్?
చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ అక్టోబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయనున్నారు. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా సోషల్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్రం నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందని తెలిసింది. ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్లో కనిపించనున్నారు. ఒక పాత్ర నక్సలిజమ్ చుట్టూ తిరుగుతుందని, ఆ పాత్ర కోసం చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ (అక్కడక్కడా నెరిసిన జుట్టు) లుక్‌లో కనిపిస్తారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా ఎంపిక అయ్యారట. చిరంజీవి పుట్టిన రోజున (ఆగస్ట్ 22) ఈ సినిమా ప్రారంభం కానుందని తెలిసింది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
అల్లు అర్జున్ కెరీర్లో తొలిసారిగా..!
2003లో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయిన బన్నీ ఇప్పటి వరకు 18 సినిమాల్లో హీరోగా నటించాడు. బన్నీ చేయబోయే 19, 20వ సినిమాలు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈసినిమాలన్నింటిల్లో బన్నీ ఒక్కసారి కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ తొలిసారిగా బన్నీ డ్యూయల్ రోల్‌కు ఓకె చెప్పాడట. ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఐకాన్ అనే సినిమాను ప్రకటించారు. ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడట. అంతుకాదు రెండు పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలు పూర్తయిన వెంటనే ఐకాన్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. -
ఎంట్రీతోనే ఇద్దరుగా..!
కొన్ని అవకాశాలు అందరికీ అందవు. వాటినే అరుదైన అవకాశాలు అంటాం. లక్కీగా నటి కీర్తీ సురేశ్‌కు అలాంటి అవకాశాలు ఆదిలోనే వరిస్తున్నాయి. కెరీర్ తొలి దశలోనే ఇళయదళపతి వంటి స్టార్ హీరోతో వరుసగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇక మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అసాధారణ నటనను ప్రదర్శించి విమర్శకులను సైతం మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రంలో మరోసారి కథలో ప్రధాన పాత్రల్లో నటిస్తోంది. అంతేకాదు చాలా తక్కువ టైమ్‌లోనే బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్న నటిగా పేరు తెచ్చుకుంది. మరో విశేషం ఏమిటంటే తొలిసారిగా బాలీవుడ్లో నటిస్తున్న హిందీ చిత్రంలో కీర్తీసురేశ్ ద్విపాత్రాభినయం చేయబోతోందన్నది తాజా సమాచారం. ఈమె నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం కూడా ఇదే అవుతుంది. దీనికి ఇంతకు ముందు బదాయ్ హో వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌దేవ్‌గన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ రెండు విభిన్న పాత్రల్లో నటింబోతోందని తెలిసింది. అయితే మధ్య వయసు పాత్ర కోసం ఎలాంటి ప్రాస్థెటిక్ మేకప్‌ను వాడకుండా తన నటనతోనే వైవిధ్యాన్ని చూపిస్తానంటోంది. ఇది భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, శిక్షకుడు సెయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న చిత్రం. దీన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఐరా ప్రత్యేకత అదే!
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆసక్తి రేకేత్తిస్తున్న చిత్రం ‘ఐరా’. ఈ సినిమాలో నయన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తుడటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాటి రాజేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ రవీంద్రన్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఐరా యూ/ఏ సర్టిఫికెట్తో ఈ నెల 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సర్జన్ మాట్లాడుతూ ‘నటి నయనతార ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ద్విపాత్రాభినయం అంటే రెండు పాత్రలకు ఏదో ఒక సంబంధం ఉంటుంది. కానీ ఐరా చిత్రంలో నయనతార పోషించిన రెండు పాత్రలకు ఎలాంటి సంబంధం ఉండదన్నా’రు. అంతేకాక ఈ రెండు పాత్రలకు నయనతార చూపించిన వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్ర ప్రచారాన్ని వైవిధ్యంగా చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అయ్యారు. ఐరా పోస్టర్లతో కూడిన ఒక బస్సుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. -
అచ్చం నానీ లాగే ఉన్నాడే..!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమా విశేషాలతో పాటు ఫ్యామిలీ ఈవెంట్స్, మెమరబుల్ మూమెంట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు. తాజాగా బాలల దినోత్సవం సందర్భంగా నాని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తన చిన్నప్పటి ఫొటోతో పాటు తన కొడుకు అర్జున్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాని ‘మేమిద్దరం ఒకేలా ఉన్నాం, నిజజీవితంలో డ్యూయల్ రోల్’ అంటూ కామెంట్ చేశాడు. నాని కొడుకు అచ్చం చిన్నతనంలో నాని లాగే ఉండటంతో ఫ్యాన్స్ ఆ ఫొటోనూ రీ ట్వీట్ చేస్తూ ఇద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. Happy children’s day :) Yes, we both look similar! Real life dual role from a different generation 😉 pic.twitter.com/mXlxMxkgVQ — Nani (@NameisNani) 14 November 2018 -
ఫస్ట్ టైమ్ డబుల్ యాక్షన్ చేశాను
‘‘మోహిని’ కేవలం హారర్ సినిమా కాదు. ఇందులో రొమాన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. అది చాలెంజింగ్‌గా అనిపించింది’’ అని హీరోయిన్ త్రిష అన్నారు. త్రిష ముఖ్య పాత్రలో దర్శకుడు మాదేష్ రూపొందించిన హారర్ చిత్రం ‘మోహిని’. ఎస్. లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్ రావు పల్లెల, కరణం మధులత ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ– రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు థ్యాంక్స్. ఫస్ట్ టైమ్ నేను డ్యూయల్ రోల్ చేశాను. వైష్ణవి, మోహినీ పాత్రల్లో కనిపిస్తాను. రెండు పాత్రలకు పోలికే ఉండదు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు మాదేష్ మాట్లాడుతూ – ‘‘హారర్ బేస్ట్ మూవీ అయినప్పటికీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.. అందుకే యు సర్టిఫికెట్ ఇస్తున్నాం అని సెన్సార్ వాళ్లు అన్నారు. 80 శాతం లండన్‌లో షూట్ చేశాం. త్రిషకు థ్యాంక్స్. చాలా స్టంట్స్, యాక్షన్ చేశారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన త్రిషగారికి థ్యాంక్స్. త్రిషగారు బ్యాక్ విత్ బ్లాక్బాస్టర్. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.బి.గురుదేవ్, సంగీతం: వివేక్ మెర్విన్. -
హీరో.. విలన్.. రెండూ అతనే..!
సీనియర్ హీరో మోహన్ బాబు చాలా కాలం తరువాత లీడ్ రోల్లో ఓ సినిమా చేస్తున్నారు. గాయత్రి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు అతిథి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగానే కాదు విలన్ గానూ కనిపించనున్నారట. విలన్ గానే ఇండస్ట్రీకి పరిచయం అయిన మోహన్ బాబు ఇటీవల కాలం ప్రతీనాయక పాత్రల్లో కనిపించలేదు. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మెగా హీరో ద్విపాత్రాభినయం..!
మెగా ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో ఆకట్టుకున్న సాయి, తరువాత ఫ్లాప్ లు పలకరించటంలో ఢీలా పడిపోయాడు. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం సినిమా ధరమ్ తేజ్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది. ప్రస్తుతం రచయిత, దర్శకుడు బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సాయి. వినాయక్ లాంటి మాస్ స్పెషలిస్ట్ తో సినిమా చేస్తే మాస్ హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకొవచ్చని భావిస్తున్నాడు. అంతేకాదు వినాయక దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో సాయి ధరమ్ తేజ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో డ్యూయల్ రోల్ చేయించి సూపర్ హిట్స్ సాధించిన వినాయక్ సాయి కి కూడా హిట్ ఇస్తాడేమో చూడాలి. -
యుద్ధంలో ఇద్దరూ హీరోలే!
యుద్ధంలో ఇద్దరు తలపడినప్పుడు ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడుతారు. అందులో గెలిచినోడు హీరో, ఓడినోడు జీరో అవుతాడు! కానీ, ‘కృష్ణార్జున యుద్ధం’లో ఇద్దరూ హీరోలేనట! అదెలా? అనడిగితే... ‘యుద్ధం మొదలవుతోందిప్పుడే కదా! అప్పుడే చెప్పేస్తే ఎలా? కొన్నాళ్లు వెయిట్ చేయండి’ అంటోంది చిత్రబృందం. ఇక్కడ కృష్ణుడూ.. అర్జునుడూ.. ఇద్దరూ నానీనే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై నాని హీరోగా సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించనున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేయనున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ‘జెంటిల్మన్’లోనూ నాని ద్విపాత్రాభినయం చేశారు. అయితే... అందులో ఒకరు హీరో, ఇంకొకరు విలన్. తాజా సినిమాలో మాత్రం రెండూ హీరో పాత్రలేనట! వచ్చే వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. కొన్ని రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ చేసిన తరువాత , నెలాఖరున యూరప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు ‘హిప్ హప్’ తమొళ స్వరకర్త. -
కృష్ణుడూ అర్జునుడూ నేనే!
.‘ఓయ్ కృష్ణా అంటే చాలు. వెంటనే వాళ్ల కళ్ల ముందు ప్రత్యక్షమవుతా! హే అర్జునా.. అని పిలిచినా పలుకుతా! ఎందుకంటే... కృష్ణుడూ నేనే, అర్జునుడూ నేనే’ అంటున్నారు హీరో నాని. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమాకు ‘కృష్ణార్జున యుద్ధం’ టైటిల్ ఖరారు చేశారు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేయనున్నారు. వెంకట్ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించనున్న ఈ సినిమాకు ‘హిప్ హాప్’ తమిళ స్వరకర్త. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
రెండు పాత్రల్లో మూడో సారి..!
నిన్నటితరం హీరోలు ద్విపాత్రభినయం చేసిన సందర్భాలు ఎక్కువే. అయితే ఈ జనరేషన్ హీరోలు మాత్రం అలాంటి పాత్రలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. అయితే ఈ జనరేషన్లో కూడా ఒకరిద్దరు తారలు డ్యుయల్ రోల్లో అలరిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు నేచురల్ స్టార్ నాని. వరుస సక్సెస్‌లతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన నాని ప్రయోగాలకు కూడా ముందే ఉంటున్నాడు. తొలిసారిగా జెండాపై కపిరాజు సినిమాలో డ్యుయల్ రోల్లో కనిపించాడు నాని. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్మన్ సినిమా కోసం మరోసారి ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదే రిస్క్‌కు రెడీ అవుతున్నాడు నాని. త్వరలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు నాని. ఈ సినిమాలో మరోసారి డ్యుయల్ రోల్లో నటించేందుకు ఓకె చెప్పాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నిన్నుకోరి, ఎమ్సీఏ సినిమాల తరువాత మేర్లపాక గాంధీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
డబుల్ గ్లామర్
గ్లామర్ పాయింట్ చాలా యేళ్ల క్రితం ‘గంగ-మంగ’ అనే సినిమా విడుదలయ్యింది. అందులో ఇద్దరు వాణిశ్రీలు ఉంటారు. ఒకరు సాఫ్ట్. మరొకరు ఫాస్ట్. ఒక వాణిశ్రీ అమాయకత్వంతో గుండెలు పిండేస్తే, మరో వాణిశ్రీ హీరోలను మించి ఫైట్లు చేసి అదరగొట్టేసింది. వాణిశ్రీ ఫ్యాన్స అందరూ రెండు విభిన్నమైన పాత్రల్లో ఆమెను చూసి యమా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సినిమా హిందీ వెర్షన్లో ‘హేమామాలిని’ని చూసి ఆమె ఫ్యాన్స కూడా విజిల్స్ వేశారు. అప్పుడే కాదు... ఇప్పటికీ హీరోయిన్ డ్యూయెల్ రోల్ చేస్తే ఫ్యాన్స ఎగబడి చూస్తున్నారు. అందుకే అడపా దడపా హీరోయిన్లు ద్విపాత్రాభినయం చేస్తూనే ఉంటారు. ‘ఓం శాంతి ఓం’లో దీపికా పదుకొనె, ‘చారులత’లో ప్రియమణి, ‘తను వెడ్స మను రిటర్న్స’లో కంగనా, రీసెంట్గా విడుదలైన ‘మయూరి’లో నయనతార తదితరులు రెండేసి డిఫరెంట్ పాత్రల్లో కనిపించి మురిపించారు. ప్రియాంకాచోప్రా అయితే త్వరలో రానున్న ఓ సినిమాలో పదమూడు పాత్రలు చేస్తోందట. ఎవరు ఎన్ని పాత్రలు వేసినా, ఎంత బాగా చేసినా... డ్యూయెల్ రోల్ చేయడంలో శ్రీదేవి స్టైలే వేరు. పలు భాషల్లో పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఆమె... ‘చాల్బాజ్’ అనే హిందీ చిత్రంతో డ్యూయెల్ రోల్‌కి ఓ స్టాండర్డని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు! -
కిక్-2లో రవితేజ డబుల్ ధమాకా!
-
'లింగా'లో రజనీకాంత్ డబుల్ రోల్!!
తమిళ యాక్షన్ చిత్రం 'లింగా'లో సూపర్‌స్టార్ రజనీకాంత్ డబుల్ రోల్ పోషిస్తున్నారు. దీంతో ఆ షూటింగులో మహా బిజీగా ఉంటున్నారు. ఈ రెండు పాత్రల్లో ఒకటి జిల్లా కలెక్టర్ పాత్ర కాగా, మరొకటి ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్ర. అయితే ఆ రెండోపాత్ర ఏంటన్న విషయాన్ని మాత్రం రహస్యంగానే ఉంచారని ఆ సినిమాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ సినిమాలో రజనీ పక్కన నటిస్తోంది. తన స్నేహితుడి కుమార్తె కావడంతో ఆమె హీరోయిన్ అనగానే కాసేపు రజనీ కాంత్ సందిగ్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబు కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. -
విక్రమ్‌కు డబుల్ షాక్!
సమంత ఇప్పుడు గ్లామర్ తార మాత్రమే కాదు... మంచి నటి కూడా. ‘మనం’తో నటిగా అందరి మనసులనూ గెలుచుకున్నారామె. సమంతతో మంచి మంచి ప్రయోగాత్మక పాత్రలు చేయించొచ్చనే అభిప్రాయానికి దర్శక, నిర్మాతలొచ్చేశారు కూడా. సమంత కూడా ఇక నుంచి కూడా ఇలాగే... విభిన్నంగా ముందుకెళ్లాలనుకుంటున్నారట. అందుకు తగ్గట్టుగానే తన కెరీర్‌ను మలచుకుంటున్నారామె. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పక్కన పెడితే... కొత్తగా ‘ఓకే’ చేసే సినిమాల విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకుంటున్నారు సమంత. అభినయానికి ఆస్కారముంటే తప్ప సినిమా ఒప్పుకోకూడదనే నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవలే తమిళంలో విక్రమ్‌కు జోడీగా నటించడానికి అంగీకారం తెలిపారామె. దర్శకుడు మురుగదాస్ నిర్మించనున్న ఈ చిత్రం మే 26న మొదలైంది. ఈ చిత్రంలో సమంత ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు చెన్నై టాక్. ఇందులో విక్రమ్ ఆటో డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఆయనను ఇద్దరు సమంతలు ప్రేమిస్తారన్నమాట. ఒకదానికొకటి పొంతన లేని పాత్రలని కోలీవుడ్ సమాచారం. అయితే... ఈ విషయాన్ని ఇటీవల తమిళ మీడియా సమంతను అడిగితే -‘‘ఆ సినిమాలో నేనేంటో చెబితే... కథ మొత్తం చెప్పేసినట్లే. కాబట్టి నో కామెంట్’’ అని సింపుల్‌గా చెప్పి తప్పుకున్నారు సమంత. ఏది ఏమైనా ఈ సినిమాతో నటిగా సమంత మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. అంతేకాదు... ఇదే నిజమైతే... ఈ తరంలో అనుష్క, ప్రియమణి తర్వాత ద్విపాత్రాభినయం చేసిన తారగా కూడా క్రెడిట్ కొట్టేస్తారు సమంత. -
ఉత్తమ విలన్లో ద్విపాత్రాభినయం
పద్మశ్రీ కమలహాసన్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. నటనలో ఎన్నో కోణాలను ఆవిష్కరించిన నట దిగ్గజం ఆయన. వైవిధ్యానికి కొండంత నిర్వచనం కమల్. అలాంటి నటదీశుడు తాజాగా ఉత్తమ విలన్ అవతారమెత్తుతున్నారు. దర్శక, నిర్మాత లింగుస్వామి నిర్మిస్తున్న అత్యంత వైవిధ్యమైన భారీ బడ్జెట్ చిత్రం ఉత్తమవిలన్. ఈ ఉత్తమ విలన్లో మరో హీరో పాత్రను కూడా పోషిస్తున్నారు. ఈ కళాపిపాసి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి తన స్నేహితుడు, నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, కథనం బాధ్యతలను కమలహాసన్ తన భుజస్కంధాలపై మోస్తున్నారు. హీరోయిన్లుగా ఆండ్రియ, పూజాకుమార్, పార్వతి మీనన్ అంటూ ముగ్గురు భామలు కమల్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. విశేషాలేమిటంటే రెండు కాల ఘట్టాల్లో జరిగే కథ. ఎనిమిదో శతాబ్దంలో రంగస్థల నటుడిగా మనోరంజన్ ఒక పాత్రలో కమల్ నటిస్తున్నారు. 21వ శతాబ్దంలో సూపర్‌స్టార్‌గా మరో పాత్రలోనూ ఆయనే జీవిస్తున్నారు. ఈ పాత్రకు గురువుగా నిజజీవితంలో గురువు అయిన కె.బాలచందర్ పోషిస్తున్నారు. మనోరంజన్ భార్యగా నటి ఊర్వశి, ఆమె తండ్రిగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.విశ్వనాథ్ నటించడం విశేషం. కమలహాసన్‌కు కె.బాలచందర్ అంటే ఎంత గురుతర భావమో కె.విశ్వనాథ్ అంటే కూడా అంత గౌరవం. వీరిద్దరితో ఆయన ఒక చిత్రంలో నటించడం ప్రత్యేకం. ఈ చిత్రంలో మానసిక ఆరోగ్యంతో బాధపడే యువతిగా నటి పూజాకుమార్ నటిస్తుండగా 21వ శతాబ్దపు కమల్ రహస్య ప్రేమికురాలిగా నటి ఆండ్రియూ నటిస్తున్నారు. ఎనిమిదో శతాబ్దపు సర్వాధికారి పాత్రలో నాజర్, జెగప్ జక్రియా అనే మరో పాత్రలో జయరాం ఆయన దత్త పుత్రిక పాత్రలో పార్వతి మీనన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
'ఉత్తమ విలన్'లో కమల్ ద్విపాత్రాభినయం
కమల్‌హాసన్ ఉత్తమవిలన్ చిత్రం గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అదే తాజా అంశం. అందులో ఒక పాత్ర ఎనిమిదో శతాబ్దానికి చెందిన నాటక కళాకారుడిగా, మరో పాత్రలో 21వ శతాబ్దానికి చెందిన సినిమా నటుడిగా చేస్తున్నాడు. ఇందులో నాటక కళాకారుడి పాత్ర పేరు ఉత్తమన్ కాగా, సినిమా సూపర్‌స్టార్ పేరు మనోరంజన్ అని ఓ ప్రకటనలో సినిమా వర్గాలు తెలిపాయి. అలాగే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆండ్రియా జెర్మియా, పూజాకుమార్ ఇందులో నటిస్తున్నారు. వీళ్లలో మనోరంజన్ పక్కన ఆండ్రియా, ఉత్తమన్ పక్కన పూజాకుమార్ చేస్తారట. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో్ కె.విశ్వనాథ్, కె.బాలచందర్, జయరామన్, పార్వతీ మీనన్, ఊర్వశి, ఎంఎస్ భాస్కర్ కూడా నటిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ ఈ సినిమాకు నిర్మాతలు.