ప్రభుత్వ విధానాల ఫలితాలకు సమయం పడుతుంది
ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆర్థిక విధానాల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలంటే.. చాలా ఓపికగా నిరీక్షించాల్సి ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ చెప్పారు. భారత్ చాలా సంక్లిష్టమైన దేశం కావడమే ఇందుకు కారణమన్నారు. అందుకే వాస్తవిక ఫలితాలు కనిపించాలంటే మరింత సమయం వేచి చూడాల్సి ఉంటుందని కెనడా -ఇండియా బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా కొచర్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత సర్కార్ పాటిస్తున్న విధానాల్లో పెద్ద మార్పు లేదని, అవే విధానాలు పాటిస్తోన్నట్లుగా ఉందని బీజేపీ నేత అరుణ్ శౌరి విమర్శించిన నేపథ్యంలో కొచర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శౌరి గత ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఎకానమీని నిర్వహించడమంటే ఏదో జరిగిపోతోన్నట్లు హడావుడి చేసి, పత్రికల పతాక శీర్షికలను మేనేజ్ చేసుకోవడమన్నట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారంటూ శౌరి విమర్శించారు.
ప్రభుత్వంలో అంతా కష్టించి పనిచేస్తున్నప్పటికీ.. అది ఫలితాల్లో కనిపించడం లేదని ఆయన చెప్పారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ ఇదే సమస్య ఉండేదన్నారు. మరోవైపు, భారత్‌ను వృద్ధి బాటలో నడిపించాలన్న ప్రభుత్వ లక్ష్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని కొచర్ చెప్పారు. ప్రస్తుతం దేశం సరైన దిశలోనే ప్రయాణిస్తోందని, రికవరీకి సంబంధించి ఇప్పటికే కొన్ని సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.