ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పు
తిరుచానూరు:
ఆంధ్ర రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో జరిగిన ఐటీ ఎలక్ట్రానిక్స్ అధికారుల సమీక్షానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ రంగం ద్వారా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు 30 కంపెనీల ప్రతినిధులు రూ.80కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుతీరులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు వారి వ్యక్తిగత ఖాతాలోనే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో సుమారు రూ.75కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మీ సేవా పథకం ద్వారా మరిన్ని సేవలందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళికలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యుఐడీఎఐ డిడి ఎంవీఎస్.రామిరెడ్డి, శ్రీనివాసరావు, రామ్‌ప్రసాద్, పద్మనాభం, ప్రకాష్, రాజశేఖర్, మునిరత్నం, రవీంద్ర, జేసి గిరీష, డ్వామా పీడి వేణుగోపాల్‌రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.