స్టాక్స్ వ్యూ
జెట్ ఎయిర్వేస్..
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత ధర: రూ.538 టార్గెట్ ధర: రూ.750
పుస్తక విలువ: రూ.-478 ముఖ విలువ: రూ. 10 ఈపీఎస్: రూ.93 ఏడాది కనిష్ట/గరిష్ట స్థాయి: రూ.284/రూ.783
ఎందుకంటే: జెట్ ఎయిర్వేస్ పనితీరు గత క్వార్టర్లో బలహీనంగా ఉంది. ఉద్యోగ వ్యయాలు 16 శాతం, తరుగుదల చార్జీలు 25 శాతం పెరగడం, రూ.92 కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టాలు... దీనికి ప్రధాన కారణాలు. తీవ్రమైన పోటీ కారణంగా సగటు దేశీయ రూట్లలో విమాన చార్జీలు 10 శాతం, అంతర్జాతీయ రూట్లలో విమాన చార్జీలు 3% చొప్పున తగ్గాయి. వీట న్నింటి ఫలితంగా నికర లాభం బాగా తగ్గింది. విమానయాన ఇంధనం(ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్-ఏటీఎఫ్) ధరలు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 13 శాతం పెరిగినప్పటికీ, గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోల్చితే 17% తగ్గాయి. దీంతో మార్జిన్లు 270 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఈ క్యూ1లో రూ.359 కోట్ల రుణాలను చెల్లించింది. రుణ భారం తగ్గించుకునే ప్రయత్నాల కారణంగా వడ్డీ వ్యయాలు 11% తగ్గాయి. 2011-12లో 29 శాతంగా ఉన్న ఈ కంపెనీ దేశీయ మార్కెట్ వాటా ఈ క్యూ1లో 19 శాతానికి తగ్గింది. స్పైస్‌జెట్ వంటి పోటీ కంపెనీలు కొత్త విమానాలు కొనుగోలు/లీజ్‌కు తీసుకోవడం ద్వారా విమాన సర్వీసులను పెంచడం దీనికి ప్రధాన కారణం.
పోటీ కంపెనీల ఫ్లీట్ కెపాసిటి నిలకడగా ఉండడం, ఎతిహాద్ కంపెనీ నుంచి ఆరు విమానాలు అందడం వంటి కారణాల వల్ల కంపెనీ మార్కెట్ వాటా పుంజుకోవచ్చు. ప్యాసింజర్ ట్రాఫిక్ 23 శాతం వృద్ధి చెందడం, మొత్తం ఆదాయంలో 24% వాటా ఉండే ఏటీఎఫ్ ధరలు తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్జిన్లు 10% రేంజ్లో ఉండొచ్చని భావిస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, ఏటీఎఫ్ ధరలు తక్కువ స్థాయిలో ఉండడం వంటి కారణాల వల్ల రెండేళ్లలో ఆదాయం 3% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా.
ఎంఆర్ఎఫ్ కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠి
ప్రస్తుత ధర: రూ.36,092 టార్గెట్ ధర: రూ.43,500
పుస్తక విలువ: రూ.16,165 ముఖ విలువ: రూ. 10 ఈపీఎస్: రూ.4,045
ఏడాది కనిష్ట/గరిష్ట స్థాయి: రూ.30,464/రూ.44,644
ఎందుకంటే: టైర్ల రంగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ వివిధ కేటగిరీ టైర్లను ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, యూరప్, పశ్చిమాసియా వంటి దాదాపు 65 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. చైనా నుంచి చౌకగా టైర్లు దిగుమతై గట్టి పోటీ ఉండటంతో ఆదాయం గత క్యూ1 స్థాయిలోనే, రూ.3,480 కోట్లుగా నమోదైంది. నికర లాభం 2 శాతం వృద్ధి చెంది రూ.490 కోట్లకు పెరిగింది. రబ్బరు ధరలు పెరగడం, సిబ్బంది, ఇతర వ్యయాలు కూడా పెరిగినప్పటికీ, నిర్వహణ పనితీరు బాగా ఉండటంతో ఇబిటా మార్జిన్ 24 శాతం పెరిగింది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ఇదే అత్యధిక స్థాయి. స్థూల మార్జిన్లు 140 బేసిస్ పాయింట్లు పెరిగాయి. రబ్బరు ధరలు పెరుగుతుండటంతో మార్జిన్లు ఒకింత తగ్గే అవకాశాలున్నాయి. అయితే ధరలు పెంచడం ద్వారా రబ్బరు ధరలు పెరిగే సమస్యను టైర్ల కంపెనీలు ముఖ్యంగా అన్ని సెగ్మెంట్లతో పాటు టైర్ల రీప్లేస్మెంట్ విభాగంలో కూడా అగ్రస్థానంలో ఉన్న ఎంఆర్ఎఫ్ సునాయాసంగా అధిగమించగలదని అంచనా.
కంపెనీ నిర్వహణ పనితీరు బాగా ఉండడం కూడా కలసివచ్చే అంశమే. ఇక గ్రామీణ డిమాండ్ పుంజుకుంటుండడం, మైనింగ్ రంగ కార్యకలాపాల జోరు పెరగడం, సాగురంగ సంబంధిత టైర్లకు డిమాండ్ మెరుగుపడుతుండడం.. సానుకూలాంశాలు. రబ్బరు ధరలు పెరిగినప్పటికీ, మంచి వర్షాలు కురియడం వల్ల డిమాండ్ పుంజుకుంటుండడం మార్జిన్ల పెరుగుదలకు ఉపకరిస్తుంది. రెండేళ్లలో అమ్మకాలు 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. రబ్బరు ధరలు పెరగడం, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడంలో జాప్యం..ప్రతికూలాంశాలు.