ప్రశాంతం
69.46 శాతం పోలింగ్ నమోదు
గతం కంటే 15.54 శాతం తగ్గిన పోలింగ్
16న ఓట్ల లెక్కింపు
నందిగామ : నందిగామ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శనివారం ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగింది. ఓటర్ల నుంచి స్పందన కొరవడటంతో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. మూడు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 15.54 శాతం తక్కువగా 69.46 శాతం పోలింగ్ నమోదైంది.
టీడీపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ
సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ తరఫున తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి బోడపాటి బాబురావు, సీపీఎం మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా వీరులపాడు మండలానికి చెందిన మాతంగి పుల్లారావు, మరో స్వతంత్ర అభ్యర్థిగా నందిగామకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి కటారపు పుల్లయ్య పోటీ చేశారు. ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ సాగింది.
పోలింగ్ సరళి ఇలా...
ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో 181వ నంబరు పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించటంతో అరగంట సేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. వెంటనే అధికారులు పరిస్థితిని చక్కదిద్దటంతో పోలింగ్ యథావిధిగా కొనసాగింది. మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. ఉదయం 9 గంటలకు 12 శాతం నమోదైన పోలింగ్ క్రమేపీ పెరిగింది.
11 గంటలకు 26.55 శాతం, ఒంటి గంటకు 47 శాతం, 3 గంటలకు 56 శాతం, 5 గంటలకు 61 శాతం, చివరకు 69.46 శాతం నమోదైంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 200 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 129 బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు 15 బూత్‌లలో ఏజెంట్లు లేకపోవడంతో అధికార పార్టీకి అడ్డులేకుండా పోయింది. కంచికచర్లలో 30 మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ విజయ్‌కుమార్ పరిశీలించారు. చందర్లపాడు, కంచికచర్ల, నందిగామ, వీరులపాడు మండలాల్లో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. ఆయన నందిగామలో విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నందిగామలో పోలింగ్ బూత్‌లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని సమీక్షించారు. 1,400 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు. 1,500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ ముగిసిన అనంతరం శనివారం రాత్రికి నందిగామలోని కేవీఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌కు ఈవీఎంలను తరలించారు.
16న కౌంటింగ్
నందిగామలోని కేవీఆర్ కళాశాలలో ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. సోమవారంలోపు కౌంటిం గ్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తామని రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు తెలిపారు.