వలలేసి మిరపకాయలు పట్టుకుంటున్న రైతన్నలు
ఏటూరునాగారం: చేపలు పట్టుకోవడం విన్నాం... కానీ, రైతన్నలు మిరపకాయలను వలలేసి పట్టుకోవడం ఏంటి...? పట్టించుకునే నాథుడు లేక... రైతన్నల ధైన్య స్థితికి నిదర్శనమే ఇది. శనివారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని గయ్యాలవాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. వాగు దిగువన రైతులు ఎండు మిరపకాయలను ఆరబోసుకున్నారు. మేడారం, గోవిందరావుపేట ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో సుమారు 200 క్వింటాళ్ల మిరపకాయలు నీటిపాలయ్యాయి. అలాగే, 50 హెక్టార్లలో వరి పంట నేలకొరిగింది. కాగా, విషయం తెలుసుకున్న రైతులు నీటిపై తేలుతూ కనిపిస్తున్న మిరపకాయలను సేకరించేందుకు చేపల వలలతో పాట్లు పడడం చూసేవారిని కదిలించింది. ఇంత జరిగినా ఉదయం 8 గంటల వరకు ఏ ఒక్క అధికారీ అటువైపు కన్నెత్తి చూడలేదు.