నగరంలో 20 వేల ‘బోగస్’ పింఛన్లు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో లైఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్ చేసుకోని 36,512 మంది ఆసరా పింఛన్లలో సగానికి పైగా బోగస్ ఉన్నాయని అధికారయంత్రాంగం అంచనా వేస్తున్నది. నగరానికి వలస వచ్చిన వారే అధికంగా ఉండటం వల్ల లైఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్‌కు దూరంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆసరా పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రెవెన్యూ యంత్రాంగం లైఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్ చేసుకోని 36,512 మందికి ముందుగా ప్రకటించినట్లుగా పింఛన్ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయలేదు. అయినప్పటికీ లైఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్‌పై సగానికిపైగా పింఛన్ లబ్ధిదారులు ఆసక్తిని కనబరచటం లేదని తెలుస్తున్నది.
దీంతో వీరంతా వలసదారులు కావటం వల్లనే లైఫ్ ఎవిడెన్స్‌కు దూరంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో దాదాపుగా 20 వేలకు పైగా బోగస్ పింఛన్లు ఉన్నట్లు అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ బోగస్‌లో కూడా 500 మందికి పైగా పింఛన్ లబ్ధిదారులు మృతి చెందినట్లు అధికార వర్గాలు నిర్ధారిస్తున్నాయి. అయితే... చనిపోయిన వారి పేరిట బంధువులు లేదా మధ్యదళారులు పింఛన్లు తీసుకున్నట్లు రుజువైనట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటంతోపాటు డబ్బులు రికవరి చేస్తామంటున్నారు. బోగస్ పింఛన్ పేరుతో డబ్బులు పొందిన వారున్నా...చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా లైఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్ నమోదు ప్రక్రియలో 11,392 మంది పింఛన్‌దారులు పాల్గొన్నప్పటికిని, వారికి సంబంధించిన ఫింగర్ ఫ్రింట్స్ ఆధార్ నంబరుతో లింకు చేసినప్పుడు... కలువక పోవటంతో వీళ్లంతా మళ్ళీ కొత్తగా ఆధార్‌నంబరు నమోదు చేసుకోవాలని అధికారవర్గాలు సూచిస్తూ ఒక నెల గడువు విధించారు. అప్పటి వరకు వీరికి పింఛన్ డబ్బులు తమ బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. విధించిన గడువు లోగా ఆధార్ నంబరు నమోదు చేసుకొని...లైఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్ చేసుకొనని పక్షంలో పింఛన్ నిలిపి వేస్తామని పేర్కొంటున్నారు.