ట్రీ ఇన్ ట్రే
పార్టీల్లో బొకేలు, ఆర్ట్ఫిషియల్ గిఫ్ట్‌లూ మామూలే. మరి ఈ ‘ట్రీ ఇన్ ట్రే’ ఏమిటి! ఇప్పుడిప్పుడే సిటీలో పెరుగుతున్న రిటర్న్ గిఫ్ట్ ట్రెండ్... బోన్సాయ్ చెట్టు. ప్రత్యేకించి చిన్నారులకు పుట్టిన రోజు బహుమతిగా అందిస్తూ... బాల్యం నుంచే ప్రకృతితో అనుబంధం పెంచుతున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో బుధవారం బోన్సాయ్పై వర్క్‌షాపు జరిగిన సందర్భంగా ‘శ్రీ బోన్సాయ్’ వ్యవస్థాపకురాలు లలితాశ్రీ ఈ విషయాలను వెల్లడించారు...
- వాంకె శ్రీనివాస్
సిటీ కుర్రాడు ఊరికెళితే చెట్ల ఒడిలో సేద తీరుతాడు. ప్రకృతిని ఆస్వాదిస్తాడు. ఈ వాతావరణం నగరంలో ఉంటే ఎంత బాగుంటుందని ఆ క్షణం అనుకుంటాడు. ఇలాంటి వారి కోసమే బోన్సాయ్. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా... పళ్లెంలో పెరిగే చెట్టు ఇది. గ్రామాల్లో చెట్లలానే పూలు పూస్తాయి. పండ్లు కాస్తాయి. రెండున్నర వేల ఏళ్ల నాటి ఈ చెట్టు ఇప్పుడు నగరవాసులకు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా మారింది. మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే దీనికి డిమాండ్ ఎక్కువ. కావల్సిన పండ్లు కోసుకు తినడమే కాదు... కాలుష్యం నుంచి కొంతవరకైనా బోన్సాయ్ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. పిల్లలైతే వారికి తెలియకుండానే పర్యావరణానికి దగ్గరవుతున్నారనేది నిపుణుల మాట.
ఒక్కోటి ఒక్కో వెరైటీ...
ఫార్మల్, ఇన్ఫార్మల్ అప్రైట్, బ్రూమ్, స్లాటింగ్, మల్టీ ట్రంక్... ఇవన్నీ బోన్సాయ్ చెట్లు పెరిగే స్టైల్స్. అభిరుచిని బట్టి ఎంచుకోవచ్చు. మేడి, జమ్మి, మర్రి, రావి చెట్లు పెంచుకొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ చెట్లకు ఆధ్యాత్మిక నేపథ్యం ఉండటంతో క్రేజ్ మరింత పెరిగింది. రూ. 250 నుంచి రూ. లక్షల వరకు ధరలున్నాయి. ఓసారి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినపుడు బోన్సాయ్ నర్సరీ గురించి తెలుసుకున్నా. చదువుకొంటూనే ఖాజాగూడలో బోన్సాయ్ నర్సరీ ఏర్పాటు చేశా. ఇప్పటి వరకు మూడు వేల మొక్కలు పెంచా. మాదిప్పుడు భారత్‌లోనే నంబర్ వన్. పదమూడేళ్ల చింత చెట్టుకు ‘ఎక్సలెన్స్ ఇన్ డిజైన్స్’ గౌరవం దక్కింది.