'పాక్' యువతిని పెళ్ళాడిన శ్రీనగర్ పోలీస్..
శ్రీనగర్ః ఓ పక్క కశ్మీర్ లోయలో పాకిస్థాన్ అనుకూల నిరసనలు కొనసాగుతుండగా.. శ్రీనగర్ కు చెందిన ఓ యువ పోలీస్ అధికారి.. పాక్ అమ్మాయిని పెళ్ళాడటం కొంత సంచలనం రేపింది. జమ్మూ కశ్మీర్ కు చెందిన పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ ఒవైస్ జిలానీ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్ కు చెందిన ఫైజా జిలానీని వివాహమాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఆందోళనల నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు వధూవరుల దగ్గరి బంధువులు మాత్రమే హాజరు కావాల్సి వచ్చింది.
లోయలో దాదాపు రెండు నెలలపాటు అశాంతి నెలకొనడానికి తోడు.. నిరసనకారులు ఆగ్రహావేశాల్లో ఉండగా స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో వివాహ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. అయితే వధూవరులిద్దరూ దగ్గరి బంధువులే అయినా.. ఆ రెండు కుటుంబాలూ పాకిస్థాన్ విభజన సందర్భంలో విడిపోయాయి. అనంతరం శాంతి కారవాన్ పేరిట శ్రీనగర్ నుంచి ముజఫరాబాద్ మధ్య బస్ సేవలు ప్రారంభమవ్వడంతో.. వరుని తండ్రి షబీర్ జిలానీ.. 2014 లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తమ బంధువులను కలసి 'నిఖా' చేసుకున్నారు.
వివాహం కుదుర్చుకున్న అనంతరం అనేక మార్లు క్రాస్ లాక్ బస్సు రద్దు కావడంతో వివాహం కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఇటీవల సదరు బస్ సర్వీసులను పునరుద్ధరించడంతో వధువు సహా ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులు వచ్చి శ్రీనగర్ లోని ఓ హోటల్ లో వివాహ కార్యక్రమాన్ని జరిపించారు. సీనియర్ జిలానీ కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. దీంతో ఇస్లామాబాద్ నేషనల్ యూనివర్శిటీలో ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కుమార్తె.. ఫైజీ జిలానీకి, కశ్మీర్ లో పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ గా పనిచేస్తున్న.. తమ బంధువైన ఒవైస్ జిలానీతో.. వివాహం జరిపించారు.