భవనంపై నుంచి పడి పురోహితుడు దుర్మరణం
* ఆత్మహత్యా... లేక ఫిట్స్ కారణమా అన్న అనుమానాలు
* పండుగ వేళ వేపగుంటలో తీవ్ర విషాదం
గోపాలపట్నం(విశాఖపట్నం):శ్రీరామనవమి పర్వదినాన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వేపగుంటలో ఐదు అంతస్తుల భవనం పైనుంచి పడి ఓ పురోహితుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా రాచగుమడాం గ్రామానికి చెందిన మురపాక రాంబాబు(30)తో అదే ప్రాంతానికి చెందిన స్వాతికి మూడేళ్ల కిందట వివాహమయింది. వీరికి నెలల ఆడ బిడ్డ, మరో రెండేళ్ల పాప ఉన్నారు. రాంబాబు పురోహితుడిగా స్వగ్రామంలో పనిచేసినా మద్యం, తదితర దురలవాట్లకు బానిసయ్యాడు.
అరోగ్యం కూడా క్షీణిస్తుండడం, తరచూ ఫిట్స్ వస్తుండడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఉన్న ఊరు నుంచి బయటకు పంపితే స్నేహితులు, అలవాట్లు మారి బాగుపడతాడని అతని తల్లిదండ్రులు, అత్తమామలు భావించారు. దీంతో నాలుగు నెలల క్రితం విశాఖ నగరం వేపగుంట గౌతంనగర్‌లో ఓ అపార్టుమెంట్లో ప్లాట్‌లో అద్దెకు దించారు. రాంబాబు, స్వాతి, పిల్లల సంరక్షణకు అయ్యే ఖర్చులు రాంబాబు తండ్రి కొండలరావు చూస్తుండేవారు. రాంబాబును మద్యం అలవాటు నుంచి దూరం చేయడానికి, నగరంలో ఓ ఆస్పత్రిలో వైద్యం ఇప్పించడానికి స్వాతి తండ్రి శ్రీనివాస్ ఖర్చులు భరించేవారు.
అయితే శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం ఇంట్లో భర్తతో కలిసి స్వాతి పూజలు చేశారు. తర్వాత దుస్తులు ఉతికి పై అంతస్తులో ఆరబెట్టారు. ఆరబెట్టిన దుస్తులు తెస్తానని చెప్పి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్లాట్లోంచి మేడపైకి రాంబాబు వెళ్లాడు. అయితే కొద్ది సేపటికే అపార్టుమెంట్ పై నుంచి శబ్దం రావడంతో ప్లాట్లలో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో బయటకొచ్చి చూసే సరికి జరగరాని దారుణం కనిపించింది. రాంబాబు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘోరం విని స్వాతి షాకయ్యింది. చాలాసేపు తేరుకోలేక పోయింది. గుండెలవిసేలా రోధించింది.
మరణంపై భిన్న కథనాలు
వేపగుంటలో జరిగిన సంఘటనపై పెందుర్తి పోలీసులకు శుక్రవారం సాయంత్రం సమాచారం అందింది. దీంతో ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు జరిపారు. స్వాతిని, ఆమె తల్లిదండ్రులను, అత్తమామలను, ప్లాట్లలో ఉన్న వారిని విచారించారు. తమకు ఎలాంటి అనుమానాలూ లేవని వీరంతా వివరణ ఇచ్చారు. అపార్టుమెంట్‌పై నుంచి దూకేసినట్లు ఘటనా స్థలంలోని పరిస్థితిని బట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక, ఫిట్స్ రావడంతో దుర్మరణం పాలయ్యాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. రాంబాబు మృతితో భార్య స్వాతి, ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేనివారయ్యారు. రాంబాబు తల్లి ప్రభావతి రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.