కూచిపూడికి పూర్వ వైభవం
- సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
విజయవాడ(వన్ టౌన్): తెలుగువారి సొతైన కూచిపూడి నృత్యానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం ఎన్ చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మూడురోజులపాటు జరిగే ఐదో అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ(ఎన్.వి.రమణ)తో కలసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. పాఠశాలల్లో ఏడు నుంచి పదో తరగతి వరకు కూచిపూడిని అభ్యసించేలా త్వరలో చర్యలు చేపడతామన్నారు.
మానవ సంస్కృతిని కాపాడటంతోపాటుగా ప్రజావికాసానికి కళలు బాసటగా నిలుస్తాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి.రమణ పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారతీయ నాట్యం, సంగీతాల్లో మనకు తెలియని ఎన్నో శాస్రీ్తయ అంశాల్ని పాశ్చాత్య దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారన్నారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. 2010, 2012, 2014 సంవత్సరాల్లో హైదరాబాద్లో నిర్వహించగా, ఇప్పుడు తొలిసారిగా నవ్యాంధ్రలో జరుపుతున్నామని వివరించారు. 25న ఆరు నుంచి ఏడువేల మందితో మహా బృందనాట్యం జరగనుందన్నారు.