In Flow
-
అధికారుల హెచ్చరిక.. ఏ క్షణంలోనే మూసీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే ఛాన్స్!
సాక్షి, నల్లగొండ: ఉపరితల ద్రోణి కారణంగా నేడు(బుధవారం) తెలంగాణలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 644 అడుగులకు చేరుకుంది. దీంతో, మూసీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గేట్లు ఎత్తివేసే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్రమట్టం వద్ద ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీనపడింది. దీంతో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్నిచోట్ల రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. ఇది కూడా చదవండి: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్.. భారీ క్యూలు! కారణం ఏంటంటే.. -
నిజామ్‌సాగర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో
నిజామాబాద్ జిల్లాలోని నిజామ్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి నిజాంసాగర్‌కు 1.16లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 19 గేట్లు ఎత్తివేసి 1.03 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. -
తాటిపూడికి భారీగా వరద
గంట్యాడ (విజయనగరం) : ఎడతెగని వానలతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో గోస్తనీ నదిపై ఉన్న తాటిపూడి రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 292 అడుగుల నీరు చేరింది. ఎగువ నుంచి 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మరో మూడు అడుగుల నీరు చేరితే జలాశయం గేట్లు ఎత్తి వేస్తామని అధికారులు తెలిపారు. వరద రాకడ కొనసాగుతున్నందున ఏ క్షణానైనా గేట్లు ఎత్తుతామని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
కిన్నెరసాని ప్రాజెక్టుకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో...
- రెండు గేట్ల ద్వారా రాత్రికి నీటి విడుదల పాల్వంచ రూరల్(ఖమ్మం జిల్లా) ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 407 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం వరకు 405.70 అడుగులకు నీటి మట్టం చేరింది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లు ఎత్తివేసి 10వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తామని నీటిపారుదల అధికారులు చెప్పారు. ఈ నీటి విడుదల వల్ల యానంబయలు, ఉలవమాల, చంద్రాలబయలు గ్రామ పంచాయతీలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయని చెప్పారు. అందుకే ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. -
శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం
శ్రీశైలం: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతోంది. మంగళవారం ఉదయం జూరాల నుంచి 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిచేరడంతో నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 802 అడుగులు కాగా పూర్తి స్థాయి 885 అడుగులు. భారీ వర్షాల కారణంగా ఇన్‌ఫ్లో బాగా పెరుగుతోంది. -
రెండు రోజుల్లో తరలిరానున్న ‘కృష్ణా’
కృష్ణా పరీవాహకంలో ఎగువన ఉన్న కర్ణాటకలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు త్వరలోనే నిండనున్నాయి. ఎగువ పరీవాహకం నుంచి ప్రాజెక్టుల్లోకి భారీ ఇన్‌ఫ్లో నమోదవుతుండటంతో ఒకట్రెండు రోజుల్లో అవి నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్‌లో కేవలం 30 టీఎంసీలు చేరితే చాలు..దిగువకు కృష్ణా పరవళ్లు తొక్కనుంది. గత ఏడాది ఆగస్టు రెండో వారంలో కర్ణాటక నుంచి తెలంగాణలోకు కృష్ణా వరద నీరు రాగా ఈ ఏడాది జూలై ఆఖరికే మొదలయ్యే అవకాశాలు మెండుగా ఉండటం రాష్ట్రానికి పెద్ద ఊరటనిచ్చే అంశమని నీటి పారుదల వర్గాలంటున్నాయి. తుంగభద్రకు భారీగా ఇన్‌ఫ్లో ఉండటం సైతం రాష్ట్రానికి పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. -
జూరాలకు తగ్గిన వరద
ఎగువప్రాంతంలో వర్షాలు తగ్గిపోవడంతో జూరాలకు వరద ఉధృతి తగ్గింది. దీంతో జూరాల జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. రిజర్వాయర్‌ను నీటితో పూర్తిస్థాయిలో నింపేందుకు ఔట్‌ఫ్లోను ఆపేశారు. జూరాల ప్రధానకాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులకు నీటి విడుదల మాత్రం కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా పంపింగ్‌ను కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 18,611 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కాల్వలు, ఎత్తిపోతల పథకాల ద్వారా 2900 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో ఔట్‌ఫ్లోను నిలిపేశామని అధికారులు అన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 10.34 టీఎంసీల నీటినిల్వ ఉంది. -
శ్రీశైలానికి తగ్గిన వరద నీరు
శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహకప్రాంతాల నుంచివచ్చే వరదనీటి ప్రవాహం తగ్గింది. దీంతో శనివారం సుమారు 63 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రం సమయానికి 13,026 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది. జూరాల నుంచి విడుదల చేస్తున్న కృష్ణా జలాలను మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో నిలిపివేశారు. ప్రస్తుతం జలాశయంలో 48.4096 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 828.90 అడుగులకు చేరుకుంది. -
ఖరీఫ్ ఖతం
రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఆయకట్టు కింద ఈ ఖరీఫ్‌లో పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు తుంగభద్రకు సరైన వరద నీరు రాలేదు. ఈ ప్రాజెక్టు నిండితేనే ఆర్డీఎస్ ద్వారా నీటి విడుదల సాధ్యమవుతుంది. కానీ, ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడంతో ఖరీఫ్ పంటపై అన్నదాతలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. - ఆర్డీఎస్ నుంచి నీటి విడుదల కష్టమే - తుంగభద్రలో 36టీఎంసీల నీటి నిల్వ చేరితేనే కిందకు విడుదల - ప్రస్తుతం వస్తున్న వరద 8,708 క్యూసెక్కులే - కర్ణాటకలో సరైన వర్షాలు లేకపోవడమే కారణం - అయోమయంలో అన్నదాత జూరాల : తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గింది. కేవలం 8,708 క్యూసెక్కులు వస్తుంది. దీంతో ఆర్డీఎస్ పరిధిలో ఖరీఫ్ సాగుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిల్వ మరో 37 టీఎంసీలు చేరితే తప్ప నీటి విడుదల సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఆ నీరు ఎప్పుడు వస్తుందో... ఆర్డీఎస్ ఆయకట్టులో ఖరీఫ్‌కు సాగునీరు ఎప్పుడు అందుతుందో తేలని ప్రశ్నగా మారింది. ప్రతి ఏటా ఆగస్టు మొదటి, రెండవ వారాల్లో ఆర్డీఎస్ ఆయకట్టుకు ఖరీఫ్ నీటి విడుదల ప్రారంభమయ్యే ది. గతేడాది ఇదే రోజున తుంగభద్ర ప్రాజెక్టు రిజర్వాయర్‌లో నీటి నిల్వ 85 టీఎంసీలు ఉంది. ఇప్పుడు కేవలం 63 టీఎంసీలకే పరిమితమైంది. కర్ణాటకలో వర్షాలు తగ్గిపోవడం, ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మరీ తక్కువగా ఉండడంతో తుంగభద్ర ప్రాజెక్టులో నీటినిల్వ పూర్తిస్థాయికి చేరేందుకు ఎన్నాళ్లు పడుతుందో అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులే మరో నెలరోజులు ఇలాగే కొనసాగితే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నదిలోకి నీటి విడుదల ప్రారంభం కాక.. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందడం కష్టమవుతుంది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వకు చేరి క్రస్టుగేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదల చేస్తేనే ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌కు నదిద్వారా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు గేట్ల నుంచి నీటి విడుదల ప్రారంభమయ్యే వరకు ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం లేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 87,500 ఎకరాల ఆయకట్టు మన రాష్ట్ర పరిధిలో, కర్ణాటకలో అధికారికంగా 5వేల ఎకరాలు, అనధికారికంగా మరో 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆర్డీఎస్ ప్రాజెక్టు 1,2 ప్యాకేజీలలో ఆధునికీకరణ పనులు పూర్తికానందున పూర్తిస్థాయి ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీళ్లందించలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ ఖరీఫ్‌లో ఆర్డీఎస్ ద్వారా 25వేల నుంచి 30వేల ఎకరాల వరకు సాగునీరందించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. తుంగభద్ర ప్రాజెక్టు రిజర్వాయర్‌లో ఉన్న ప్రస్తుత నీటి నిల్వ నుంచి హెచ్ఎల్బీసీ, ఎల్‌ఎల్‌బీసీలకు ఖరీఫ్ ఆయకట్టులో నారుమడులు చేసుకునేందుకు ఇప్పటికే నీటి విడుదలను ప్రారంభించారు. రోజూ దాదాపు 7వేల క్యూసెక్కుల విడుదల కొనసాగుతుండగా రిజర్వాయర్‌కు పై నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో రోజురోజుకు తగ్గిపోతుంది. ఇన్‌ఫ్లో తగ్గిపోయినా ఆయకట్టుకు నీటి విడుదల చేసినందున పంటలు పూర్తయ్యే వరకు ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి ఔట్‌ఫ్లోను ప్రధాన కాలువల ద్వారా చేయాల్సి ఉంటుంది. దీంతో రిజర్వాయర్‌లో ఉన్న నీటిమట్టం రోజురోజుకు మరింతగా తగ్గిపోతుంది. వర్షాలు ఇలాగే ఆలస్యమైతే రిజర్వాయర్‌లో మరింతగా నీటిమట్టం పడిపోయి ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు ఈ ఖరీఫ్‌లో కన్నీళ్లు తప్పేలా కని పించడం లేదు. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 100.86 (1633 అడుగులు) టీఎంసీలు కాగా, ప్రస్తు తం ప్రాజెక్టు రిజర్వాయర్ నీటి నిల్వ మట్టం 63.7 (1621.98 అడుగులు) టీఎంసీలుగా ఉంది. గతేడాది ఇదే రో జున 85 టీఎంసీల నీటినిల్వ ఉంది. -
పెరుగుతూ.. తగ్గుతూ
నాగార్జునసాగర్ :నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చే వరద పెరుగుతూ... మళ్లీ తగ్గుతోంది. వాస్తవానికి కృష్ణానదికి ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకుండా, స్థానికంగా కురుస్తున్న వర్షాలతో వరద వస్తోంది. దీంతో ఈ వరద నీటిని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. శ్రీశైలం జలాశయానికి సోమవారం అర్ధరాత్రి దాటేసరికి ఎగువ నుంచి వచ్చే వరద ఒక్కసారిగా తగ్గింది. దీంతో వెంటనే ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు మూసివేశారు. దీంతో దిగువన ఉన్న సాగర్ జలాశయ గేట్లు కూడా మంగళవారం తెల్లవారుజామున మూయాల్సి వచ్చింది. ఉదయానికి వరదఉధృతి పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రెండుగేట్లు తెరుచుకున్నాయి. దీంతో మళ్లీ సాగర్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. సాయంత్రానికి వరదతగ్గడంతో గేట్లను మూసివేశారు. కేవలం విద్యుదుత్పాదన ద్వారా 75,854క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు పది గేట్లను మొదట ఎత్తారు. ఆ తర్వాత ఎనిమిదికి, పెరిగిన పర్యాటకులు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను చూడటానికి పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో కృష్ణాతీరం సందడిసందడిగా మారింది. పర్యాటకులు బారులుదీరి కృష్ణమ్మ అందాలను తనివితీరా చూశారు. చంద్రవంకవాగు పొంగి పొర్లుతుండటంతో ఎత్తిపోతల వద్ద జలపాత దృశ్యం పర్యాటకులకు ఆహ్లాదం కలిగించింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తరలివస్తున్నారు. వీరంతా అత్యధిక సంఖ్యలో వస్తుండడంతో చిరువ్యాపారులకు పండగ వాతావరణం నెలకొన్నది, మొక్కజొన్న కండెలు, వేరుశనగకాయలకు గిరాకీ పెరిగింది.