గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
కర్నూలు(స్పోర్ట్స్): క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి అన్నారు. స్థానిక ఔట్ డోర్ స్టేడియంలో శనివారం కర్నూలు జోనల్ బాలుర ఫుట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. స్నేహ సంబంధాలు మెరుగు పడతాయన్నారు.
క్రీడాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని విశిష్ట అతిథి జంపాల మధుసూధనరావు తెలిపారు. కర్నూలు నిర్వహక క్రీడల అధ్యక్ష, కార్యదర్శులు బి.నాగరాజు, కె.పరమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, కె.వెంకటేశ్వర్లు, సి.వెంకటేశ్వర్లు, టి.క్రిష్ణ తదితరులు జీయర్ పాల్గొన్నారు. అండర్-14 విభాగంలో 8 జట్లు, అండర్-17 విభాగంలో 11 జట్లు పాల్గొంటున్నాయి.
మొదటి రోజు విజేతలు వీరే...
అండర్-17 విభాగంలో టౌన్ మోడల్ జట్టు సీఆర్ఆర్ ఎస్ఏపీ క్యాంపు జట్టుపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సిస్టర్ స్టాన్సిలాస్ జట్టు చిత్తారివీధి కేశవరెడ్డి జట్టుపై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. జెడ్పీ ఉల్చాల జట్టు నెహ్రూ మెమోరియల్ జట్టుపై 4-0 గోల్స్ తేడాతో, శ్రీలక్ష్మి పాఠశాల జట్టు కేశవరెడ్డి పాఠశాల(వీఆర్.కాలనీ) జట్టుపై 2-0 గోల్స్ తేడాతో, మాంటిస్సోరి ఏ క్యాంపు జట్టు లిటిల్ బర్డ్స్ జట్టుపై 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించాయి.
అండర్-14 విభాగంలో సీఆర్ఆర్ ఎస్ఏపీ క్యాంపు జట్టు లిటిల్ బర్డ్స్ జట్టుపై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. శ్రీలక్ష్మి హైస్కూల్ జట్టు మునిసిపల్ స్కూలు జట్టుపై 2-1 గోల్స్ తేడాతో, ఉల్చాల జెడ్పీ పాఠశాల జట్టు కేశవరెడ్డి చిత్తారి స్ట్రీట్ జట్టుపై 2-0 గోల్స్ తేడాతో, మాంటిస్సోరి ఏ క్యాంపు జట్టు టౌన్ మోడల్ జట్టుపై 2-0 గోల్స్ తేడాతో తమ ప్రత్యర్థుల జట్లపై విజయం సాధించాయి.