అమెరికన్ ఆర్మీ స్థావరంలో కాల్పులు, నలుగురు మృతి
అమెరికాలోని టెక్సాస్ లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరం తుపాకీ కాల్పులతో మార్మోగింది. ఈ సంఘటనలో నలుగురు చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. గత ఆరు నెలల్లో అమెరికన్ సైనిక స్థావరాల్లో కాల్పులు జరగడం ఇది మూడో సారి. ఫోర్ట్ హుడ్ లో ఇది రెండవ సారి.
స్థానిక టీవీల కథనాల ప్రకారం ప్రజలను తలుపులు, కిటికీలు మూసుకోవాలసిందిగా మైక్ ల ద్వారా ప్రకటనలు వెలువడ్డాయి. పోలీసులు ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు, ఆంబులెన్స్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
2009 లో ఒక ముస్లిం మత గురువు ప్రేరణతో ఒక ఆర్మీ సైకియాట్రిస్టు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 13 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరొక 32 మందిని తీవ్రంగా గాయపరిచాడు. గత సెప్టెంబర్ లో వాషింగ్టన్ నేవీ యార్డులో ఇలాంటి సంఘటనే జరిగింది. అందులో 12 మంది చనిపోయారు. గత నెల వర్జీనియాలోని అమెరికన్ నేవీ బేస్ లో ఒక పౌరుడు కాల్పులు జరపడంతో ఒక నేవీ సైనికుడు చనిపోయాడు. . తాజా ఫోర్ట్ హుడ్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ఒబామా తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు.