నవంబర్ 12న శ్రామిక మహిళా ఫోరం మహాసభ
విజయవాడ (గాంధీనగర్) : సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో ఏపీ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభ నవంబర్ 12న జరుగుతుందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ పి.సూర్యావతి తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ మహాసభను ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్కౌర్ ప్రారంభిస్తారన్నారు. ముఖ్యఅతిథిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ తెలుగు శాఖాధికారిణి కొలకలూరి మధుజ్యోతి హాజరవుతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 500 మంది శ్రామిక మహిళలు ప్రతినిధులుగా పాల్గొంటారని వివరించారు. నూతన రాష్ట్రంలో శ్రామిక మహిళల సమస్యలు, హక్కులపై చర్చించి మహిళాభ్యున్నతికి, సాధికారత సాధన దిశగా భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. పని ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలి, సమాన పనికి సమాన వేతనం, రాత్రి సమయాల్లో మహిళలు పనిచేయకుండా నిషేధించాలి.. వంటి తొమ్మిది డిమాండ్లను మహాసభ ప్రభుత్వం ముందుంచుతుందని పేర్కొన్నారు. డిమాండ్ల సాధనకు ప్రతి మహిళ మహాసభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రామిక మహిళా ఫోరం కో–కన్వీనర్ ఆర్.లక్ష్మీదేవి, టీవీ భవానీ, కె.శైలజ, డాక్టర్ సుజాత పాల్గొన్నారు.