Fraudulent promises
-
అదృష్ట దేవతమీదేనంటూ వల
సాక్షి, కామారెడ్డి: ‘లాటరీలో అదృష్ట దేవత మీ తలుపు తట్టొచ్చు.. దాంతో డబ్బులు సులువుగా సంపాదించొచ్చు.. కారో, బంగారు నగలో.. ఏదో ఒకటి మీ సొంతం’అంటూ లాటరీ స్కీంల నిర్వాహకులు ప్రజలను బుట్టలో వేస్తున్నారు. నెలనెలా ఊహించని బహుమతులు మీ సొంతం కావొచ్చంటూ అందమైన బ్రోచర్లను ముద్రించి సభ్యులను చేర్పిస్తున్నారు. అక్రమ దందాతో రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మొదలైన ఈ అక్రమ దందా ప్రస్తుతం పది జిల్లాలకు విస్తరిం చింది. కొంతకాలం కిందట రూ.30 వేలు కడితే నెలనెలా రూ.10 వేల చొప్పున పది నెలల పాటు మొత్తంగా రూ.లక్ష ఇస్తామంటూ నమ్మబలికిన ‘బీర్షేబా’అనే సంస్థ ప్రజల నుంచి రూ.వందల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఇది మరచిపోకముందే లాటరీల పేరుతో లూటీ జరుగుతోంది. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే ఇలాంటివి 45 స్కీంలు నడుస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులే స్కీంల నిర్వాహకులుగా అవతారం ఎత్తడంతో అడ్డుకునే వారు లేకుండా పోయారు. 3 వేలకు పైగా సభ్యులతో.. ఒక స్కీం నిర్వాహకులు 2,999 మంది సభ్యులను చేర్చుకుని, నెలకు రూ.వెయ్యి చొప్పున 15 నెలల పాటు వసూలు చేశారు. మరో స్కీం నిర్వాహకులు 3 వేల మంది సభ్యులతో, నెలకు రూ.1,500 చొప్పున 12 నెలల పాటు వసూలు చేశారు. మరో స్కీం నిర్వాహకులు 3,500 మంది సభ్యులను చేర్చుకుని నెలకు రూ.1,200 చొప్పున 12 నెలల పాటు నడిచే స్కీం పెట్టారు. ఇలా జిల్లాలో దాదాపు 45 స్కీంలు కొనసాగుతున్నాయి. కామారెడ్డిలో మొదలైన దందా మెదక్, సిద్దిపేట, నిర్మల్, సంగారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ తదితర జిల్లాలకూ విస్తరించింది. కామారెడ్డికి చెందిన నిర్వాహకులు అక్కడి వారిని ఏజెంట్లుగా చేర్చుకుని దందాను నడుపుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్కీంలలో దాదాపు 1.3 లక్షల మంది సభ్యులు ఉన్నట్లు అంచనా. ఆకర్షణీయ బహుమతులు స్కీంల నిర్వాహకులు మంచి బహుమతులంటూ అమాయకులను సభ్యులుగా చేర్చుకుంటున్నారు. 2,999 మంది సభ్యులు ఉంటే అందరికీ కచ్చితమైన బహుమతి అని చెబుతున్నారు. ఇందులో బంపర్ డ్రాలుగా కార్లు, బంగారు ఆభరణాలు, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, స్కూటీలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, సెల్ఫోన్ల వంటివి ఇస్తున్నారు. మొత్తం సభ్యుల్లో 200 మంది వరకు బంపర్ డ్రాలో పెద్ద పెద్ద బహుమతులు వస్తాయి. ఆఖరుకు మిగిలిన సభ్యులకు తలా ఒక చిన్నపాటి బహుమతి ఇస్తారు. సభ్యుడు నెలకు వెయ్యి చొప్పున రూ.15 వేలు చెల్లిస్తే, అతనికి ఇచ్చే బహుమతి విలువ రూ.5 వేల లోపే ఉంటుంది. కానీ సభ్యులకు బంపర్ డ్రాల ఆశ చూపి సభ్యులుగా చేర్పిస్తున్నారు. రూ. కోట్ల దందా.. జిల్లా కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంలో కోట్లకొద్దీ రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక స్కీంలో 15 నెలల పాటు నెలకు రూ.వెయ్యి చొప్పున 3 వేల మంది సభ్యులు చెల్లించే మొత్తం రూ.4.5 కోట్లు అవుతుంది. ఇందులో బంపర్ బహుమతులు, మిగతా సభ్యులందరికీ ఇచ్చే సాధారణ బహుమతులన్నింటికీ కలిపి రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఏజెంట్లకు కమీషన్‌గా రూ.20 లక్షల వరకు చెల్లిస్తున్నారు. మరో రూ.50 లక్షల వరకు ఇతర ఖర్చులు పోయినా ఒక్కో స్కీం ద్వారా రూ.2 కోట్ల వరకు మిగులుబాటు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఏ కష్టం లేకుండా రూ.కోట్లు వస్తుండడంతో ఒక్కో స్కీం నిర్వాహకుడు కొత్తగా మరికొన్ని స్కీంలు రూపొందించి ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వీటిపై దృష్టి సారించారు. నిర్వాహకులపై కఠినచర్యలు బంపర్ డ్రాల పేరుతో కొందరు లాటరీలను నడుపుతున్నారు. అలాంటి వాటికి ఏ రకమైన అనుమతులు లేవు. ఇలాంటి స్కీంలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. ప్రజలు అత్యాశకు పోయి డబ్బులు పెట్టి మోసపోతున్నారు. లక్కీ డ్రాల గురించి తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వండి. 08468–226633 నంబరుకు కాల్ చేయండి. – శ్వేత, కామారెడ్డి ఎస్పీ -
29 కంపెనీలపై సెబీ వేటు
సాక్షి, ముంబై: సెంట్రల్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 29 కంపెనీలపై నిషేధం విధించింది. ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఎల్, ) పాటు మరో 28 కంపెనీలను మార్కెట్లనుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మోసపూరిత, అన్యాయమైన వాణిజ్య పధ్ధతుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈ సంస్థల కార్యకలాపాలను బ్యాన్ చేసింది. మూడు సంవత్సరాలపాటు ఈ నిషేధం అమలు కానుంది. ముఖ్యంగా సెక్యూరిటీస్ అప్పెలేట్ ట్రిబ్యునల్ (ఎస్ఏటి) గత నెలలో సెబీకి జారీచేసిన తుదిఆదేశాల ప్రకారం సెబీ ఈ చర్య తీసుకుంది. 2012, 15 మార్చి నుంచి 2014 మార్చి 31 కాలంలో ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ధర, ట్రేడింగ్ వాల్యూమ్‌లో చోటుచేసుకున్న అసాధారణ పరిణామాలపై మార్కెట్ రెగ్యులేటరీ విచారణ చేపట్టింది. దీంతో 29 కంపెనీలపై మూడు సంవత్సరాలపాటు మార్కెట్లనుంచి తొలగించింది. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఎల్, కంఫర్ట్ గ్రూప్ డైరెక్టర్లు ప్రాథమికంగా తప్పుడు పద్ధతుల్లో మోసపూరిత పథకాన్ని లాంచ్ చేయడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారంటూ సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రిఫరెన్షియల్ ఎలాట్మెంట్ మార్గంలో కేవలం కొంతమంది వాటాదారులకే లబ్ది చేకూరేలా అక్రమ పద్ధతులను అవలంబించారని పేర్కొంది. అంతేకాదు ఇదే అంశంపై ఆదాయం పన్ను (ఇన్వెస్టిగేషన్) డైరెక్టర్ జనరల్ నుంచికూడా సెబికి ఫిర్యాదులు అందాయి. ఎఫ్ఎఫ్ ఎస్ఎల్ , దాని అనుసంధానిత సంస్థలు తప్పుడు పథకాల ద్వారా, అక్రమ లావాదేవీలు, షేర్ ధర అమాంతం పెంపు లాంటి అక్రమాలు చోటు చేసుకున్నట్టు నివేదించింది. -
తుపాకీ రాముడిని తలపిస్తున్న సీఎం
కేసీఆర్‌పై ఈరవత్రి అనిల్ విమర్శలు కమ్మర్పల్లి : మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కేసీఆర్ తన పాలనతో తుపాకి రాముడిని తలపిస్తున్నారని ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయ న కమ్మర్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేవన్నారు. బంగారు తెలంగాణ సాధించుకుందామన్న కేసీఆర్.. తన పాలనతో బాధల తెలంగాణగా మారుస్తున్నారన్నారు. అర్హులెందరికో పింఛన్ దక్కలేదన్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలకు, ప్రభుత్వానికి ఒరి గిందేమీ లేదన్నారు. వ్యవసాయానికి సక్రమం గా విద్యుత్ సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. పంట రుణా ల మాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పటి పరిస్థితికంటే విడిపోయాకే దారుణంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం పెదవి విప్పకపోవడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ పింఛన్లు, ఆహార భద్రత కార్డులు ఇప్పించేందుకు పోరాడుతామని పేర్కొన్నారు. సమావేశంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి, పార్టీ బాల్కొండ అధ్యక్షుడు గంగారెడ్డి, నాగంపేట సర్పంచ్ ముత్తెన్న, ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్, నాయకులు శ్రీనివాస్, రఫీ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. ఇంకా ఎంతకాలం మోసగిస్తావ్?
సరుబుజ్జిలి: మోసపూరిత హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నయవంచకుడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కొత్తకోట సర్పంచ్ సురవరపు శిమ్మినాయుడు, జెడ్పీటీసీ ప్రతినిధి సురవరపు నాగేశ్వరరావు కుటుంబాలను ధర్మాన శుక్రవారం పరామర్శించారు. ఇటీవల వీరి తల్లి సురవరపు లక్ష్మీనారాయణమ్మ మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి మృతికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ఇంకా ప్రజలను నమ్మించాలని చూడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ చేస్తానన్న బాబు పెద్దడాబుగా మారారని దుయ్యబట్టారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకుని, నిరుద్యోగులను నమ్మించి వారి ఉద్యోగాల మాట అటుంచి, ఉన్న వారిని తొలగిస్తూ నిరుద్యోగుల పాలిట శత్రువుగా మారారని ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అర్హుల పింఛన్లు నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటులేక నడిసంద్రంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వంలో స్పందనలేదని, రాజధాని పేరుతో దృష్టంతా రియల్ వ్యాపారాలపైనే సారించారని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టే నాయకుడు ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ధర్మాన పునరుద్ఘాటించారు. సురవరపు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు మామిడి శ్రీకాంత్, చల్లా రవికుమార్, డీసీఎంఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తితోపాటు స్థానిక నాయకులు లావేటి విశ్వేశ్వరరావు, కొవిలాపు చంద్రశేఖర్, గౌరినాయుడు, కరణం అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.