సరుబుజ్జిలి: మోసపూరిత హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నయవంచకుడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కొత్తకోట సర్పంచ్ సురవరపు శిమ్మినాయుడు, జెడ్పీటీసీ ప్రతినిధి సురవరపు నాగేశ్వరరావు కుటుంబాలను ధర్మాన శుక్రవారం పరామర్శించారు. ఇటీవల వీరి తల్లి సురవరపు లక్ష్మీనారాయణమ్మ మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి మృతికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ఇంకా ప్రజలను నమ్మించాలని చూడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ చేస్తానన్న బాబు పెద్దడాబుగా మారారని దుయ్యబట్టారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకుని, నిరుద్యోగులను నమ్మించి వారి ఉద్యోగాల మాట అటుంచి, ఉన్న వారిని తొలగిస్తూ నిరుద్యోగుల పాలిట శత్రువుగా మారారని ధ్వజమెత్తారు.
జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అర్హుల పింఛన్లు నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటులేక నడిసంద్రంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వంలో స్పందనలేదని, రాజధాని పేరుతో దృష్టంతా రియల్ వ్యాపారాలపైనే సారించారని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టే నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ధర్మాన పునరుద్ఘాటించారు.
సురవరపు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు మామిడి శ్రీకాంత్, చల్లా రవికుమార్, డీసీఎంఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తితోపాటు స్థానిక నాయకులు లావేటి విశ్వేశ్వరరావు, కొవిలాపు చంద్రశేఖర్, గౌరినాయుడు, కరణం అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.
బాబూ.. ఇంకా ఎంతకాలం మోసగిస్తావ్?
Published Sat, Jan 3 2015 7:40 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement