సైకిళ్లను పంపిణీ చేసిన జయలలిత
టీనగర్: ఈ ఏడాది 6,44,000 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీని ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం చెన్నై సచివాలయంలో ప్రారంభించారు. 2014-15 విద్యా సంవత్సరంలో ప్లస్ ఒన్ చదివే విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అందజేశారు. రాష్ట్రంలో మహిళా విద్యను ప్రోత్సహించే విధంగా హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో ప్లస్‌ఒన్, ప్లస్‌టూ తరగతులు చదివే ఆదిద్రావిడ షెడ్యూల్ కులాల విద్యార్థినులందరికి సైకిళ్లను అందజేసే పథకం 2001-02లో ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు.
ఆ తర్వాత 2005-06 సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్లస్‌ఒన్ తరగతులు చదివే అన్ని వర్గాల విద్యార్థులకు ఈ పథకాన్ని విస్తరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఏడాది ప్రారంభంలోనే విద్యార్థులకు సైకిళ్లు అందజేసే విధంగా 2014-15 సంవత్సరంలో *230 కోట్ల 72 లక్షల ఖర్చుతో 2,86,400 మంది విద్యార్థులు, 3,57,600 విద్యార్థినులు మొత్తం 6,44,000 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేసే విధంగా ఏడుగురు విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం సైకిళ్లను అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు కేసీ వీరమణి, ఎస్.అబ్దుల్ రహీం, ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్‌సుందర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డెరైక్టర్ అశోక్ డోంగ్రే, అధికారులు పాల్గొన్నారు.
భక్తుల వసతి గృహం ప్రారంభం
తిరుచెందూర్ ఆలయంలో భక్తులు బస చేసే విధంగా వసతి గృహాన్ని, తల నీలాలు సమర్పించేందుకు ప్రత్యేక మండపాన్ని ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం చెన్నై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించారు.