న‘గరం’...గరంగా..
టవర్‌సర్కిల్: కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశం మందిరంలో గురువారం జరిగిన తొలి అత్యవసర సమావేశం వాడివేడిగా జరిగింది. రంజాన్ పండుగ ఏర్పాట్లపై ఈనెల 21న మజీద్ కమిటీలతో జరిపిన సమావేశానికి అధికార పక్షం కార్పొరేటర్లకు మాత్రమే సమాచారమిచ్చారని, తమ డివిజన్లలోనూ ముస్లింలు ఉన్నారని, తమకెందుకు సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గందె మాధవి నిలదీశారు. మజీదు కమిటీలను మాత్రమే ఆహ్వానించామని టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ ఆరిఫ్ సమాధానపరిచేందుకు ప్రయత్నించినా ఆమె శాంతించలేదు. అజెండా కాపీని రాత్రి 10.30 గంటలకు అందజేస్తే అందులోని అంశాలను ఎలా అవగాహన చేసుకుంటామని, ఇదంతా ప్రతిపక్షాల గొంతునొక్కడానికి పన్నిన కుట్ర అని విమర్శించారు. కమిషనర్ పాలకవర్గానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
ప్రణాళిక కార్యక్రమం ఈనెల 21వరకు జరగడంతో అంచనాలు రూపొందించడం ఆలస్యమైందని, రాజకీయాలు పక్కన పెట్టి అజెండా లో ఉన్న వాటిపై మాట్లాడాలని మేయర్ రవీందర్‌సింగ్ నచ్చజెప్పేప్రయత్నంచేశారు. డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ మాట్లాడుతూ.. ఎవ రూ రాద్ధాంతం చేయొద్దని, కొత్త ఆలోచనలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు క లిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్ప టి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు.
దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు తమను బెదిరిస్తున్నారని, తమ గొంతునొక్కే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారబోర్డుల్లో అవకతవకలు జరిగాయని చెబుతున్న మే యర్ అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేపదే మాధవి అడ్డుపడుతుండడంతో మిగతావారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఒక్కరే మాట్లాడడం సరికాదని సభ్యులంతా ధ్వజమెత్తారు. మేం పిచ్చోళ్లం కాదని అందరికోసం మాట్లాడుతున్నామని కాం గ్రెస్ కార్పొరేటర్లు సమాధానమిచ్చారు. మొత్తమ్మీద సమావేశం వాడివేడిగా ప్రారంభమై.. అజెండా అంశాలతో ముగిసింది. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, కమిషనర్ రమేశ్ పాల్గొన్నారు.