'గ్యాంగ్‌స్టర్‌ని కాదు.. మొబైల్ షాపు ఓనర్ని'
ముంబయి: తాను గ్యాంగ్‌స్టర్‌ని కాదని ఇటీవల సింగపూర్ పోలీసుల చేతికి చిక్కిన కుమార్ పిళ్లై అన్నాడు. చైనాలో ఓ మొబైల్ షాపు నిర్వహించుకుంటున్నానని చెప్పాడు. ముంబయిలోని పలు వ్యాపారుస్తులను, బిల్డర్స్‌ను అతడు డబ్బుకోసం తీవ్రంగా బెదిరిస్తున్నాడని ఆరోపణలు రావడంతోపాటు పోలీసులు అతడికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గతంలో హత్య, దోపిడీ కేసుల కిందట అరెస్టయిన అతడు బెయిల్ పేరిట బయటకొచ్చి 1990లో పారిపోయాడు. అప్పటి నుంచి ఎటు వెళ్లిపోయాడో ఎవరికీ తెలియదు. అయితే, విదేశాలకు పారిపోయాడని తెలిసింది.
ఈ నేపథ్యంలో ఇంటర్ పోల్ అధికారులు అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉండగా, ఈ మధ్యకాలంలో ముంబయిలో పలువురు బిల్డర్లను బెదిరిస్తూ సెటిల్ మెంట్ లు చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా భారత్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతడిని సింగపూర్ పోలీసులు గత ఫిబ్రవరిలో అరెస్టు చేశారు.
కాగా, అక్కడి నుంచి ముంబయికి తీసుకొచ్చిన పోలీసులు అతడిని ప్రశ్నించగా తాను గ్యాంగ్ స్టర్ ని కాదని, చైనాలో మొబైల్ షాపు నిర్వహిస్తున్నానని చెప్పాడు. అలాగే, ఎల్టీటీఈకి తనకు సంబంధం లేదన్నాడు. ముంబయిలో తాను సెటిల్ మెంట్లు చేయలేదని, తన పేరు చెప్పుకొని తన అనుచరుడు రవి పూజారీ ఈ పనిచేసి ఉంటాడని, రవికి తనకు సంబంధాలు 2000 నుంచే తెగిపోయాయని చెప్పాడు.