పిడుగుపాటుతో ఆరుగురు దుర్మరణం
వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఆరుగురు మృత్యు ఒడికి చేరారు. తర్లుపాడు మండలం గానుగపెంటలో అత్తాకోడళ్లు, మార్కాపురం మండలం వేములకోటలో ఒక యువకుడు, మర్రిపూడి మండలం సిద్దారెడ్డిపల్లెలో ఓ యువరైతు, నాగులుప్పలపాడు మండలం చవటపాలెంలో మరో యువకుడు, వలేటివారిపాలెం మండలం కూనీపాలెంలో మరో మహిళ పిడుగుల బారినపడి తనువు చాలించారు.
అత్తాకోడళ్లు మృతి
గానుగపెంట (తర్లుపాడు) : పిడుగుపడి అత్తాకోడళ్లు మృతి చెందిన సంఘటన ఆదివారం గానుగపెంటలో జరిగింది. ఈ ప్రమాదంలో గానుగపెంటకు చెందిన అత్తాకోడళ్లు లింగాల వెంకట సుబ్బమ్మ (65), లింగాల వెంకట రమణ (35) మృతి చెందారు. గ్రామ సమీపంలోని పొలంలో పత్తి తీసేందుకు కూలీలతో పాటు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడడంతో తల దాచుకునేందుకు సమీపంలోని చింత చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడటంతో అత్తాకోడళ్లు అక్కడికక్కడే మరణించారు. తాడివారిపల్లె ఎస్సై ఎస్.వి.రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. జిల్లా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి బాల నాగయ్య మృతదేహాలను పరిశీలించారు.
వేములకోటలో..
మార్కాపురం : పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం మార్కాపురం మండలంలోని వేములకోట పొలాల్లో జరిగింది. వేములకోటకు చెందిన రైతు తన పొలంలో వ్యవసాయ బోరు వేయించుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. బోరు మిషన్ వద్ద పనిచేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతుల్లా జిల్లా టెడ్డార్ గ్రామానికి చెందిన సతీష్ కుమార్ (24)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. మార్కాపురం రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పశువులు మేపుకొంటుండగా..
వలేటివారిపాలెం : పిడుగుపాటుతో మహిళ మృతి చెందిన సంఘటన కూనీపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన జాగర్లమూడి శంకరమ్మ (43) పశువులు కాసుకోవడానికి పొలానికి వెళ్లి పిడుగు పడటంతో మరణించింది. సాయంత్రమైనా శంకరమ్మ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మృతి చెందిఉంది. నాగులుప్పలపాడు మండలం చవటపాలేనికి చెందిన కొమ్ము మరియదాసు (27) కూడా పిడుగుపాటుకు మృతి చెందారు.
ప్రభుత్వానికి నివేదిక
ఒంగోలు టౌన్ : జిల్లాలో పిడుగుపాటు మృతుల వివరాలను యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ప్రాథమికంగా ఆరుగురు మరణించినట్లు నిర్ధారించారు. ఇప్పటివరకు మూడు గేదెలు కూడా మృత్యువాతకు గురైనట్లు నివేదికలో పొందుపరిచారు.
యువ రైతు మరణం..
సిద్దారెడ్డిపల్లె (మర్రిపూడి) : పిడుగుపాటుతో యువ రైతు మృతి చెందిన సంఘటన సిద్దారెడ్డిపల్లెలో ఆది వారం జరిగింది. సిద్దారెడ్డిపల్లెకు చెందిన యువరైతు దుద్దుకుంట చెన్నారెడ్డి (34) తన భూమిలో వరి నారు పోసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చెన్నారెడ్డి వరి నాటుకోవాలనే ఆలోచనతో పొలాన్ని దమ్ము చేసుకొనేందుకు తూర్పువైపున ఉన్న మాగాణి భూమిలోకి వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపడి చెన్నారెడ్డి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.