ప్రభుత్వరంగ సంస్థలపై ఆంధ్రాబ్యాంక్ దృష్టి
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక మందగమనం వల్ల కార్పొరేట్ రుణాలకు డిమాండ్ తక్కువగా ఉండటంతో ప్రభుత్వరం సంస్థలపై ఆంధ్రాబ్యాంక్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)కు రూ.300 కోట్ల రుణం మంజూరు చేయనున్నట్లు ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్ తెలిపారు.
దీనికి సంబంధించి ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు విశాఖ పర్యటనకు వచ్చిన రాంజేంద్రన్ తెలిపారు. హౌసింగ్, అగ్రికల్చర్, గోల్డ్, చిన్నతరహా పరిశ్రమల రుణాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో వీటిపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.50 లక్షల కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే రెండు నెలల్లో రూ. 20 వేల కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
మొండిబకాయిలు ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయని, ప్రస్తుతం ఇవి 5 శాతానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ఏటీఎంలకు భద్రత పెంచాల్సిందేనని ప్రభుత్వం పదేపదే చెబుతున్న నేపథ్యంలో నెలకు ఒక్కో ఏటీఎంకు సుమారుగా రూ.45వేలకుపైగా ఖర్చవుతోందని, ఇది వినియోగదారులపై ఎంతవరకు మోపాలనే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.ప్రైవేటు బ్యాంకులకు ధీటుగా తాముకూడా ఏటీఎంల్లో కొత్తకొత్త సర్వీసులు ప్రారంభించామని, ఇదికాక మరో 150 నవశక్తి బ్యాంకులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.