ఊహను నిజం చేసిన మెర్సిడెస్
ఒక్కసారి ఊహించుకోండి. మీ ఆఫీసు అయిపోయింది. ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చారు. కారు దగ్గరకు రాగానే డోర్ దానంతట అదే తెరుచుకుంది. మీరు ఎక్కి కూర్చునేందుకు వీలుగా సీటు.. డోర్ వైపు తిరిగింది. మీరు అందులో కూర్చున్న తర్వాత అది యథాస్థానానికి మారింది. డోర్ లాక్ అయింది. ఎక్కడకు వెళ్లాలో ఆదేశాలిచ్చి.. హాయిగా కళ్లు మూసుకుని రిలాక్స్ అయ్యారు.
అంతే.. కారు దానంతట అదే మిమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేర్చింది! అలాంటి కారు ఉంటే బావుంటుంది కదూ? ఈ ఊహను జర్మనీ కంపెనీ మెర్సిడెస్ నిజం చేసింది. స్వీయ చోదక.. అదేనండీ.. సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఆవిష్కరించింది. వాస్తవానికి గూగుల్ గతేడాదే సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేసినప్పటికీ, చూడటానికి బొమ్మకారులా ఉండటంతో అది ఎవరినీ అంతగా ఆకట్టుకోలేదు.
కానీ మెర్సిడెస్ తాజాగా లాస్వేగాస్లో ప్రదర్శించిన ఎఫ్015 అనే ఈ కారు సందర్శకుల మతి పోగొట్టింది. ఈ కారును, అందులోని ప్రత్యేకతలను చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. 17 అడుగుల పొడవు, ఐదు అడుగుల ఎత్తు ఉన్న ఈ వాహనం.. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 1100 కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఇక దీని విండోలకు ఆరు టచ్ స్క్రీన్ ప్యానెల్స్ ఉన్నాయి. వాటి ద్వారా కారును కంట్రోల్ చేయడంతోపాటు బయటి దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు.
టచ్‌తోనే కాకుండా కంటిచూపుతోనూ వాటిని ఆపరేట్ చేయొచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌తోపాటు మనం సొంతంగా కూడా దీనిని నడిపే వెసులుబాటు ఉంది. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ కారును ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తారో, ధర ఎంతో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.