సరుకులు.. సర్దేదెలా?
ప్రొద్దుటూరు: సంక్రాంతికి చంద్రన్న కానుక అందేది అనుమానమే... ఆరు సరుకులు ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం మాట నెరవేర్చేందుకు అధికారులు, డీలర్లు కిందామీదా అవుతున్నారు. కేజీ, అరకేజీలుగా ఇవ్వాల్సిన సరుకులు బస్తాలు, 10 కేజీల రూపంలో రావడంతో వాటిని విడగొట్టి ప్యాకెట్లలో సర్దడం ఎలా అని తలపట్టుకుంటున్నారు. ప్రస్తుతం గోడవున్లకు చేరిన సరుకులు రెండు రోజుల్లో డీలర్ల ద్వారా వినియోగదారులకు అందించడం సాధ్యమయ్యే పనేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నారుు.
నిజామాబాద్ జిల్లా నుంచీ ప్రొద్దుటూరు గోడౌన్‌కు సరఫరా అయిన బెల్లం కేక్‌లు ఒక్కొక్కటి 10 కిలోలుగా ఉంది. నిబంధనల ప్రకారం మిగతా వస్తువులతో పాటు రేషన్ కార్డుదారునికి అరకిలో బెల్లం అందించాల్సి ఉంది. అయితే అధికారులు విడిగా ప్యాక్ చేయకుండా ఇదిగో ఇలా గోడౌనుకు చేర్చారు. అత్యవసరంగా ప్రభుత్వం ఈ నెల 11 నుంచే కానుక వస్తువులను పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు నేరుగా ఈ బెల్లం కేక్‌లను డీలర్లకు చేరవేస్తున్నారు.
డీలర్ల ఇళ్లకు సరకులు చేరిన తర్వాత డ్వాక్రా మహిళలను నియమించి ఈ బెల్లం కేక్‌లను పగులగొట్టించి అరకిలో చొప్పున ప్యాక్ చేయించి వినియోగదారులకు ఇవ్వాలట. ఈ బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ఈ కేక్‌లను పగులగొట్టి20 ప్యాకెట్లలో నింపడం అంత సులువైన పనా. కేవలం బెల్లం మాత్రమే కాదు గోధుమ పిండి, కందిబేడలు, శనగలు కూడా 100 కిలోల బస్తాల్లో వచ్చాయి. వీటన్నిటినీ ఇలాగే డీలర్లకు అప్పగించి డ్వాక్రా మహిళల ద్వారా కిలో, అరకిలో ప్యాకెట్లు తయారు చేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకు గానూ కిలో, అరకిలో పాలిథీన్ కవర్లను కూడా సరఫరా చేశారు.
అరుుతే డ్వాక్రా మహిళలకు కూలీ చెల్లిస్తారా అనే విషయంపై స్పష్టంగా చెప్పడం లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. వీటన్నిటినీ తమకు అప్పగిస్తే ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. విడగొట్టిన తర్వాత అంతే తూకాలు వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ఈ సరకులు గోడౌన్లకు రాకపోగా అధికారులు వీటిని ఇంకా డీలర్లకు సరఫరా చేయలేదు.
దీంతో అటు అధికారులతో పాటు ఇటు డీలర్లు కూడా పండుగకు ముందే పంపిణీ చేయగలమా అని ఆందోళన చెందుతున్నారు. కాగా చంద్రన్న సంక్రాంతి కానుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల ఉత్పత్తి కర్మాగార సంస్థ నుంచీ నెయ్యి ప్యాకెట్లను సరఫరా చేశారు. తద్వారా సంస్థకు ఆదాయం రావడంతో పాటు వ్యాపారానికి సంబంధించి ప్రజల్లో మరింత ప్రచారం కూడా జరుగనుంది.