తల్లికన్నా గోమాత గొప్పది
తిరుపతి కల్చరల్: గోమాత తల్లికన్నా గొప్పదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి ఉద్ఘాటించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో గో ప్రదక్షిణశాలకు మంగళవారం ఉదయం ఆయన భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ పురాణాల్లో గోమాతకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, స్థానికులు ముందుగా గోమాతకు పూజలు చేసేలా ఇక్కడ గో ప్రదక్షిణశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు జి.శేఖర్‌రెడ్డి సొంత నిధులతో దీన్ని చేపట్టడం ఆనందదాయకమని పేర్కొన్నారు. రూ.67 లక్షలతో 4,468 ఎస్ఎఫ్టీ వైశాల్యంలో నిర్మించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ గోప్రదక్షిణ శాల ఏర్పాటుతో గోమాతకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు జి.శేఖర్‌రెడ్డి, డాక్టర్ బాల వీరాంజనేయులు స్వామి, జి.భానుప్రకాష్‌రెడ్డి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, సుచిత్ర ఎల్లా, ఏవీ.రమణ, డీపీ అనంత సంపత్ రవి నారాయణన్, అరికొల నరసారెడ్డి, టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింత రామచంద్రారెడ్డి, గోసంరక్షణ శాల సంచాలకుడు హరినాథ్‌రెడ్డి, టీటీడీ ఎస్ఈ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.