21 నుంచి డైట్‌సెట్ కౌన్సెలింగ్
ఒంగోలు వన్‌టౌన్ : ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి (డైట్‌సెట్) ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించాలని విద్యాశాఖ అదనపు డెరైక్టర్ సురేంద్రరెడ్డి జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో సమావేశంలో డీఈవోతో మాట్లాడారు.
డైట్‌సెట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు వెబ్‌కౌన్సెలింగ్ పూర్తయింది. వెబ్‌కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులకు కళాశాలలను కూడా కేటాయించారు. వీరికి ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలించి తుది ప్రవేశపత్రం (ఫైనల్ అడ్మిషన్ లెటర్) జారీ చేయాలని సురేంద్రరెడ్డి, డీఈఓలు, డైట్ ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. ప్రధానంగా డైట్‌సెట్‌లో సీటు సాధించిన విద్యార్థులకు 17 సంవత్సరాలు నిండినదీ లేనిది క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
డీఈడీ ప్రభుత్వ కళాశాలలో సీటు పొందిన వారు రూ.2,345, ప్రైవేట్ కళాశాలలో సీటు పొందిన రూ.12,500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2 లక్షల లోపు, బీసీ అభ్యర్థులకు లక్ష లోపు ఆదాయ ధ్రువీకరణపత్రాలను సమర్పించాలి. జిల్లాలో మైనంపాడులోని జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో ఈ నెల 21 నుంచి 23 వరకు డీఈడీ మొదటి సంవత్సరం సీటు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని డైట్ ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ తెలిపారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలనకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. అభ్యర్థులు అన్ని ధ్రువీకరణపత్రాలతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని డీఈవో కోరారు.