దృష్టిని బట్టి.. సృష్టి!
ఉత్తర భారత దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ స్వామివారి దర్శనార్థం తిరుపతి వెళ్ళాడు. తనతో పాటు సహాయకుడిగా పరిశోధక విద్యార్థిని కూడా వెంట తీసుకు వచ్చాడు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి గుండా తిరుమలకు కాలినడకన వెళ్ళాలనేది ప్రొఫెసర్ గారి ఆలోచన. అలిపిరికి వెళ్ళి ఎత్తైన శేషాచల శిఖరాన్ని చూశారు. సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఏడుకొండల్ని చూసి భక్తి భావంతో దణ్ణం పెట్టుకున్నారు. పాదాల మండపం వద్ద శ్రీవారి లోహ పాదాలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఉండగా పరిశోధక విద్యార్థి చిన్నగా ప్రొఫెసర్ని ఇలా అడిగాడు.‘‘దేవుడు నిజంగా ఉన్నాడంటారా?’’ అని. ప్రొఫెసర్ నవ్వి ‘‘దారిలో కనిపిస్తాడు పద!’’ అని చెప్పి కాలినడకకు పురమాయించాడు.అలిపిరినుంచి ఆనంద నిలయుని సన్నిధికి దారి తీసే ఆ పడికట్ల దోవలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడక ప్రారంభించారు. తలయేరు గుండు, గాలి గోపురం, ఏడవ మైలు ప్రసన్నాంజనేయ స్వామి, అక్కగార్ల గుడి, అవ్వాచారి కోన... దాటి మోకాలి మెట్టు చేరారు. తిరుమల కొండ ‘ఆదిశేషుని అంశ’ అని భక్త జన విశ్వాసం. అందుకే చెప్పులు లేకుండా కొండ ఎక్కుతారు భక్తులు. ఈ కొండను పాదాలతో నడిచి అపవిత్రం చేయకూడదని శ్రీరామానుజులు, హథీరాంజీ బావాజీ మోకాళ్ళ మీద నడిచారని చెబుతారు. అప్పటినుంచి అది మోకాలి మెట్టు అయ్యిందని కూడా తెలుసుకున్నారు. అక్కడ మెట్లు నిలువుగా మోకాలి ఎత్తు ఉండటం వల్ల మోకాళ్ళు పట్టుకు΄ోసాగాయి పరిశోధక విద్యార్థికి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన ఆ విద్యార్ధి గట్టిగా ‘‘దేవుడు కనిపిస్తున్నాడు!’’ అని చె΄్పాడు.చిన్న నవ్వు నవ్విన ప్రొఫెసర్, ‘‘అనుకున్నది అనుకున్నట్లు ఎవరికీ జరగదు. అలా జరిగితే ఎవ్వరూ చెప్పిన మాట వినరు. తలచినట్లే అన్నీ జరిగితే... మనిషి దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు లేకుంటే తనంత గొప్పవాడు లేడని విర్రవీగుతాడు. అహాన్ని తలకి ఎక్కించుకున్నవాడు తనే దేవుడని చెప్పి ఊరేగుతాడు. జీవితం కష్టసుఖాల మయం కాబట్టే, మనిషి ఆ అతీత శక్తిని ఆరాధిస్తున్నాడు! అందుకే అలిపిరి వద్ద నేల మీద నడిచేటప్పుడు నీకు దేవుడి ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. మోకాలిమెట్టు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడని అనిపించింది’’ అని చెప్పి గబగబా మెట్లు ఎక్కసాగాడు.‘దృష్టిని బట్టి సృష్టి’ అని తెలుసుకున్న విద్యార్థి గోవింద నామస్మరణ చేస్తూ ప్రొఫెసర్ వెనుకనే నడవసాగాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు