దళిత, మహిళా పారిశ్రామికవేత్తలకు ఫండింగ్
ముంబై: స్టాండప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కృషిచేస్తుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 2.5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనుందని తెలిపారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) ఆధ్వర్యంలో ఏర్పాటైన 5వ జాతీయ పారిశ్రామిక, వాణిజ్య ఎగ్జిబిషన్‌ను ముంబైలో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి, సాధికారతకు, తద్వారా దేశ ఆర్థిక పురోగతికి తమవంతు సహకారం అందించే దిశగా డిక్కీ ప్రోత్సహిస్తున్నదని మిశ్రా పేర్కొన్నారు.
చిన్న పారిశ్రామికవేత్తలకు తగినంత రుణాలు దొరకకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని మిశ్రా అభిప్రాయపడ్డారు. ఈ సవాలును అధిగమించేందుకు సూక్ష్మ, చిన్న మధ్య తరహా మంత్రిత్వ శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందన్నారు. స్టాండప్ ఇండియాలో భాగంగా దేశంలోని 1.25 లక్షల బ్యాంకింగ్ శాఖలు ఎస్సీ లేదా ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు నిధులను అందించనున్నాయన్నారు. అలాగే ఆవిష్కరణలకు నిలయమయ్యే స్టార్టప్‌లకు ప్రత్యేక మద్దతు ఇవ్వనున్నట్లు, అందులో భాగంగా ప్రభుత్వం నుంచి నిధులను అందించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ).. గ్రామీణ, పట్టణప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెంచేందుకు వీలుగా చేపట్టిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్‌లను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారీ పరిశ్రమల శాఖా మంత్రి అనంత్ గీతే మాట్లాడుతూ.. దళిత పారిశ్రామికవేత్తలకు సైతం మంచి భవిష్యత్ ఉండనుందన్నారు. దేశంలోని 292 ప్రభుత్వ రంగ సంస్థలు.. ఇకపై తమకు అవసరమైన వస్తువుల్లో 20 శాతం సూక్ష్మ, చిన్నమధ్య తరహా పరిశ్రమల నుంచే సేకరించడం తప్పనిసరి చేసినట్లు చెప్పారు. ఇందులో 4 శాతం దళిత పారిశ్రామికవేత్తలకు చెందిన సంస్థల నుంచి సేకరించాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్రేడ్ ఫెయిర్ ప్రారంభించారు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సాధికారత అవసరాన్ని నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన 30 స్టాళ్లు సహా 350 స్టాల్స్ ఈ ట్రేడ్ లో పాల్గొంటున్నాయి.