పౌరసరఫరాల హమాలీల యూనియన్ 2 శాఖలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ హమాలీల రాష్ట్ర యూనియన్ ప్రాంతాలవారీగా రెండు శాఖలను ఏర్పాటు చేసుకుంది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన యూనియన్ విస్తృతస్థాయి సమావేశంలో రెండు ప్రాంతాలకు వేర్వేరు కమిటీలను నియమించారు. ఏపీ పౌరసరఫరాల హమాలీల రాష్ట్ర యూనియన్ అధ్యక్షురాలుగా ఆర్.కృష్ణ(కర్నూలు), ఉపాధ్యక్షులుగా అంజిరెడ్డి (ప్రకాశం), మధుసూదన్‌రావు(నెల్లూరు), ప్రధాన కార్యదర్శిగా ఉదయ భాస్కర్ (పశ్చిమ గోదావరి జిల్లా) ఎంపికయ్యారు. వీరితోపాటు ముగ్గురు కార్యదర్శులు, కోశాధికారి, 9మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంపికయ్యారు. తెలంగాణ పౌరసరఫరాల హమాలీల యూనియన్ అధ్యక్షులుగా ఎ.అమ్మయ్య (నల్లగొండ), ప్రధాన కార్యదర్శిగా మాదిరెడ్డి అంజిరెడ్డి(ఖమ్మం)తోపాటు ఏడుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంపికయ్యారు.
‘ఎస్పీఎఫ్ సిబ్బందిని ఏఆర్‌లో కలపండి’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీఎఫ్)లోని కింది స్థాయి సిబ్బందిని పోలీసుశాఖలోని ఆర్మ్డ్ రిజర్వు(ఏఆర్) విభాగంలో మిళితం చేయాలని ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్‌కౌర్ మీనన్ రాష్ట్ర హోంశాఖకు సిఫార్సు చేశారు. ఆ మేరకు 2 రోజుల కిందట ప్రింటింగ్ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీపై వెళ్లేముందు ఆమె ఈ సిఫార్సు చేసినట్లు ఎస్పీఎఫ్ వర్గాలు తెలిపాయి.