‘చాబహర్’ను ప్రారంభించిన ఇరాన్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక సాయంతో ఇరాన్లో నిర్మించిన చాబహర్ నౌకాశ్రయం మొదటి దశను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ఆదివారం ప్రారంభించారు. ఈ వ్యూహాత్మక పోర్టు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు వీలుకలుగుతుంది. ఈ పోర్టు వల్ల ఇరాన్, భారత్, అఫ్గాన్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది.
ఇరాన్‌లోని సిస్టాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో నిర్మించిన ఈ పోర్టును భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న నౌకాశ్రయాలతో సులువుగా అనుసంధానం చేయవచ్చు. అలాగే చైనా పెట్టుబడులతో పాకిస్తాన్లో నిర్మించిన గ్వాదర్ పోర్టుకు ఇది కౌంటర్‌గా కూడా ఉపయోగపడనుంది. చాబహర్ ప్రారంభోత్సవంలో షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. అలాగే భారత్–ఇరాన్–అఫ్గాన్ మంత్రుల స్థాయి సమావేశం చాబహర్లో జరిగింది. పోర్టులు, రోడ్, రైల్ సహా అనుసంధానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.