సోషల్ వేదికలను ఎత్తేస్తే..?
సాక్షి, వెబ్ డెస్క్ : నేటి కంప్యూటర్ యుగంలో చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ల వరకు అందరూ ఆన్లైన్ వేదికగా వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చర్చిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలోనే పలకరింపులన్నీ.
వ్యక్తిగత భావాలను, ఆలోచనలను, అభిప్రాయాలను ప్రపంచానికి సులువుగా చేరవేయడంలో సోషల్‌మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్, ట్వీటర్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార మార్పిడి జరుపుతూనే గడుపుతున్నాడు నేటి మనిషి.
సోషల్‌మీడియా భావాలు ఇంతగా చొచ్చుకుపోయిన మనిషిని ఉన్నట్లుండి ఆన్లైన్ వేదికలను వదిలేయమంటే?. స్పందన ఎలా ఉంటుంది?. ఇదే ప్రశ్నపై ‘హారిస్ పోల్’ అనే సంస్థ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేతో అభిప్రాయాలు పంచుకున్న 2 వేల మంది అమెరికనట్లు సోషల్‌మీడియా వేదికలను తొలగిస్తేనే మంచిదని అభిప్రాయపడ్డారు.
ట్వీటర్‌ను తొలగించాలని 46 శాతం మంది చెప్పగా.. మరో 43 శాతం మంది ట్వీటర్ ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు. ‘టిండర్’ విషయానికొస్తే 43 శాతం దాన్ని ఎత్తేయాలని చెప్పగా.. 42 శాతం అసలు టిండర్ ఏంటో తమకు తెలియదన్నారు. కేవలం 15 శాతం మంది మాత్రమే టిండర్ కావాలని చెప్పారు.
ఇక రెండు బిలియన్లకుపైగా క్రియాశీలక యూజర్లు కలిగివున్న ఫేస్‌బుక్‌ను 32 శాతం మంది నిలిపివేయాలని కోరుకుంటున్నారు. కాగా, గరిష్టంగా 64 శాతం మంది ఫేస్‌బుక్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.