మూడేళ్లు.. 70 కిలోలు!
బొమ్మలు, బంతితో ఆడుకుంటున్న ఈ బాలుడి పేరు మైసెల్. వయసు మూడేళ్లు.. బరువు 70 కిలోలు..! బ్రెజిల్‌కు చెందిన ఈ బాలభీముడు పుట్టినప్పుడు సాధారణ శిశువుల మాదిరిగా 2.9 కిలోల బరువు మాత్రమే ఉన్నాడు. అయితే, తర్వాత క్రమంగా బరువు పెరిగిపోయి, మూడేళ్ల వయసు వచ్చేసరికి 70 కిలోలు దాటేశాడు. ‘ప్రాడర్-విల్లీ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యులోపమే మైసెల్ ఇలా భారీకాయుడు కావడానికి కారణమని డాక్టర్లు గుర్తించారు.
ఈ జన్యులోపం ఉన్న వ్యక్తులకు అదే పనిగా ఆకలి వేస్తుంటుందని, ఎంత తిన్నా ఇంకా తినాలనే కోరిక ఉంటుందని వివరించారు. ఇలాంటి లోపం ఉన్న పిల్లలు అదే వయసున్న పిల్లలు తినే తిండి కంటే మూడు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా తింటారని పేర్కొన్నారు. అలా తింటున్నప్పటికీ వీరిని ఆకలి వెంటాడుతూనే ఉంటుందని, ఫలితంగానే ఇలా భారీకాయంతోపాటు బరువు కూడా పెరిగిపోతారని తెలిపారు. ప్రస్తుతం వీడి తిండి కంట్రోల్ చేయడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు.