టాటా కొత్త ఎస్యూవీ ‘హెక్సా’
• ధరలు రూ.12.08 లక్షలు –17.48 లక్షల రేంజ్లో
• మైలేజీ 14.4 కి.మీ.
ముంబై: టాటా మోటార్స్ కంపెనీ కొత్త స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ), హెక్సాను మార్కెట్లోకి తెచ్చింది. ఈ లైఫ్ స్టైల్ ఆఫ్–రోడర్ వాహన ధరలు రూ.12.08 లక్షల–రూ.17.43 లక్షల రేంజ్లో ఉన్నాయని టాటా మోటార్స్ తెలిపింది. ఈ హెక్సా ఎస్యూవీ, ఇన్నోవా, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, మారుతీ ఎర్టిగలకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ హెక్సా కారు ఆరు వేరియంట్లలో (మూడు మాన్యువల్, మూడు ఆటోమేటిక్), ఐదు రంగుల్లో లభిస్తుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ కార్ బిజినెస్) మయాంక్ పరీక్ చెప్పారు. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందిన ఈ ఏడు సీట్ల కారు 14.4 కి.మీ. మైలేజీని ఇస్తుందని టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గుంటెర్ బషెక్ పేర్కొన్నారు. హెక్సా రాకతో తమ మరో ఎస్యూవీ అరియాను మార్కెట్ నుంచి ఉపసంహరిస్తున్నామని, సఫారీని మాత్రం కొనసాగిస్తామని పరీక్ తెలిపారు.
హెక్సా ప్రత్యేకతలు..: 2.2 లీటర్ వారికోర్ 400 డీజిల్ ఇంజిన్‌తో రూపొందిన హెక్సాలో 6 స్పీడ్ జి–85 ట్రాన్సిమిషన్, సూపర్ డ్రైవ్ మోడ్, 10 స్పీకర్లతో కూడిన కనెక్ట్నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్(స్మార్ట్ ఫోన్ కంపాటబిలిటి, యూఎస్బీ బ్లూటూత్ కనెక్టివిటీ,) డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, కార్నర్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్, ట్రాక్షన్, క్రూయిజ్ కంట్రోల్, మూడ్ లైటింగ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డే రన్నింగ్ లైట్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.