హిజ్రా దారుణ హత్య
పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట) : స్థానిక మునేరు మధ్యలో ఉన్న లంక గడ్డలో ఓ హిజ్రా హత్యకు గురైన ఘటన సోమవారం సంచలనం కలిగించింది. లంక గడ్డలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందన్న సమాచారం మేరకు పోలీసు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిసరాలు పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా శరీరంపై జాకెట్ మాత్రమే ఉండగా చీర, లంగా పక్కన పడేసి ఉన్నాయి. సమీపంలో ఎంగిలి విస్తరాకులు, మద్యం తాగటానికి ఉపయోగించిన గ్లాసులు, సీసాలు ఉన్నాయి.
మృతుడి కాళ్లకు పట్టీలు, చేతికి ఉంగరం ఉండటంతో పాటు శరీరంపై అమ్మవారి పచ్చబొట్టు ఉంది. ముఖంపై మోదినట్లు గాట్లతోపాటు పక్కన బండరాయి ఉంది. దీనిపై 302 కింద కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నందిగామ సీఐ పీవీ రమణ విలేకరులతో మాట్లాడుతూ హత్యకు గురైన వ్యక్తి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనుగుంట గ్రామానికి చెందిన పాలకిటి రామయ్య అలియాస్ రమ్యగా ఘటనా స్థలంలో దొరికిన రుణానికి సంబంధించిన రశీదు బట్టీ తెలుస్తోందన్నారు.
హత్యకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించటంతో పాటు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని, నిందితులను కొద్ది రోజుల్లో పట్టుకుంటామని చెప్పారు. హత్య ఏ కోణంలో జరిగిందనే దానిమీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశామని చెప్పారు. వీఆర్వో సుధశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అవినాష్ తెలిపారు. కాగా, సేకరించిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు హిజ్రాలు ఆటోలో పెనుగంచిప్రోలు వచ్చి అమ్మవారి ఆలయం సమీపంలో గదిని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.